సమంత అక్కినేని గత పది సంవత్సరాలుగా తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ తన నటనా చాతుర్యంతో తెలుగు ప్రేక్షకుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రస్తుత కాలంలో టాలీవుడ్ సినీ పరిశ్రమలో బెస్ట్ హీరోయిన్ ఎవరని అడిగితే సమంత అక్కినేని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అయితే సమంత అక్కినేని నాగచైతన్య ని వివాహమాడిన తర్వాత గ్లామర్ రోల్స్ లో నటించడానికి అంగీకరించడం లేదు. యూ టర్న్, ఓ బేబీ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో ఆమె నటించడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. చివరిగా ఆమె శర్వానంద్ హీరోగా నటించిన జాను సినిమాలో నటించి అందరినీ మెప్పించారు. కానీ ఆ సినిమా ప్రేక్షకాదరణ పొందలేకపోవడంతో తాను స్క్రిప్టు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని సినీ వర్గాల నుంచి టాక్ వినిపించింది.


మరోవైపు జాను సినిమా తర్వాత సమంత అక్కినేని రెండు నెలల వరకు తన తదుపరి సినిమా గురించి ఏ ప్రకటన చేయకపోవడంతో... ఆమె గర్భం ధరించిందని... ఇకపై సినిమాలకు స్వస్తి చెప్పి వివాహ జీవితాన్ని గడుపుతారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ సమంత అక్కినేని మాత్రం ఈ పుకార్లపై పెదవి విప్పి తాను ఇంకా నటిస్తానని చెప్పుకొచ్చారు. అలాగే విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కే కాతు వాకులా రేండు కాదల్ సినిమాలో నటిస్తున్నానని సమంత అక్కినేని తెలిపారు. అశ్విన్ శరవణన్ తో ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రంలో కూడా సమంత అక్కినేని నటిస్తున్నారు.


అయితే సమంత ఈ రెండు చిత్రాల్లో నటించిన తర్వాత తన నటనా జీవితానికి గుడ్ బై చెప్పనున్నారని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. తన నటనా జీవితానికి సమంత అక్కినేని స్వస్తి చెప్పినప్పటికీ నిర్మాణ రంగంలో అడుగుమోపి సినిమాలను తెరకెక్కించనున్నారని సినీ వర్గాల నుండి టాక్ వినిపిస్తుంది. కథాబలం ఉన్న లేడీ ఓరియంటెడ్ చిత్రాలను తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి లాభాలు ఆర్జించాలని సమంత అక్కినేని భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఆమె సినిమాల్లో నటించడం కొనసాగిస్తే నిర్మాణ రంగంలో పూర్తి సమయాన్ని కేటాయించలేరు. అందుకే సినిమా జీవితానికి శాశ్వతంగా వీడ్కోలు చెప్పేందుకు సమంత అక్కినేని సిద్ధమవుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: