బ్లాక్ బస్టర్ హిట్స్ తో పాటుగా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు మన అల్లు అర్జున్. అల వైకుంఠపురములో తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన బన్నీ..ఇప్పుడు పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దాంతో ఒక్కసారిగా బన్నీ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్ లో వంద కోట్ల క్లబ్ లో చేరటంతో కార్పొరేట్ యాడ్స్ కూడా ఆయనకు వస్తున్నాయి. అయితే యాడ్స్ తో హీరోలందరికీ మైలేజ్ వస్తుంటే బన్నీ మాత్రం వివాదాల్లో ఇరుక్కుంటున్నాడట.. మొన్న ప్రముఖ బైక్ టాక్సీ కంపెనీ రాపిడోకి బ్రాండ్ అంబాసిడర్ గా.. అల్లు అర్జున్ చేసిన యాడ్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వివాదాస్పదం అయ్యిన విషయం అందరికి తెలిసిందే.ఆ యాడ్ ఆర్టీసీ సంస్థని కించపరిచేలా ఉందని తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ మండిపడ్డాడట.బన్నీకి, రాపిడో సంస్థకి క్లాస్ పీకి వెంటనే అభ్యంతరకర దృశ్యాలని తొలగించేలా చేశాడట.. లక్షలాది సామాన్య ప్రజల రవాణా సంస్థని ఒక పెద్ద స్టార్ హీరో అయి ఉండి అవమానించటంపై అప్పట్లో పెద్ద ఎత్తున అల్లు అర్జున్ పై విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఆ వివాదం మరిచిపోకముందే బన్నీ చేసిన మరో యాడ్ కాంట్రవర్సీ అవుతుందట.

బన్నీ తాజాగా ఆన్ లైన్ ఫుడ్ సప్లై చేసే ప్రముఖ సంస్థ జొమాటో కోసం ఒక యాడ్ చేశారు. ఈ యాడ్ లో బన్నీతో పాటు టాలీవుడ్ విలన్ సుబ్బరాజు కూడా నటించాడట.ఈ యాడ్ లో బన్నీ కొడితే గాల్లో ఎగురుతాడు సుబ్బరాజు. అలా గాలిలో ఎగురుతూనే మాట్లాడుతూ ఉంటాడట.. ఎంతసేపటికి కింద పడకుండా బన్నితో సంభాషిస్తున్నట్టు యాడ్ లో చూపించారట.. సహజంగా సౌంత్ ఇండియన్ సినిమాల్లో ఇలాంటి లాజిక్ లేని ఫైట్స్ ఎక్కువగా ఉంటాయని నార్త్ నెటిజన్స్ నుండి బాగా ట్రోల్స్ వస్తుంటాయి. మరి ఈ యాడ్ కోసం జోమాటో వారు ఇదే కాన్సెప్ట్ వాడారో ఏమో కానీ ఈ యాడ్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. జోమాటో యాడ్ లో బన్నీ, సుబ్బరాజుల సంభాషణని ఒక్కసారి కనుక చూస్తే.. బన్నీ కొట్టగానే గాలిలో తేలిపోతున్న సుబ్బరాజు మాట్లాడుతూ.. 'బన్నీ నన్ను త్వరగా కిందకు దించవా? అని అంటే 'సౌత్ సినిమా కదా? ఎక్కువ సేపు ఎగరాలి' అని బన్నీ అంటాడట. దీంతో.. 'నాకు గోంగూర మటన్ తినాలని ఉంది. కిందకి వచ్చేలోపు రెస్టారెంట్స్ మూసేస్తారు' అని సుబ్బరాజు అంటాడట. ' గోంగూర మటన్ ఏంటీ ఇప్పుడు ఏం కావాలన్న జొమాటో ఉందిగా తగ్గేదేలే' అని బన్నీ చెప్తాడట.అంతే ఈ యాడ్ సౌత్ సినిమాలు మరియు అందులో యాక్షన్ సీక్వెన్స్‌లపై బన్నీ కౌంటర్ వేసినట్టుగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారట . మొత్తానికి ఇప్పుడు ఈ యాడ్ మాత్రం నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: