దశావతారాల లెక్కల ప్రకారం శ్రీకృష్ణుడు నారాయణుడి 8వ అవతారం. శ్రీకృష్ణ అవతారం నారాయణుడి పరిపూర్ణ అవతారంగా భావిస్తారు. వైష్ణవ సాంప్రదాయంలో ఎక్కువమంది భక్తులు శ్రీకృష్ణుడు అవతారాన్ని మాత్రమే ఆరాధిస్తారు. మనదేశంలో క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం నుండి ప్రజలు శ్రీకృష్ణుడు ని ఆరాధించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. చంద్రగుప్తుడి ఆస్థానాన్ని క్రీస్తు పూర్వం నాల్గవ శతాబ్ధంలో సందర్శించిన గ్రీకు యాత్రీకుడు మెగస్తనీస్ తన రచనలలో అలనాటి శ్రీకృష్ణుడి ఆలయాలను వర్ణించాడు.


మహాభారత యుద్ధంలో అర్జునుడు కి గీతాభోధ చేసిన ‘భగవద్గీత’ సమస్త లోకానికి సంబంధించిన కర్తవ్య భోధ. ద్వాపరి యుగంలో శ్రీముఖ నామ సంవత్సరం శ్రావణం మాసంలో బహుళ అష్టమినాడు అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్య తిథినే ‘కృష్ణాష్టమి’గా జరుపుకుంటారు. కృష్ణాష్టమిని జన్మాష్టమి గోకులాష్టమి అష్టమి అని కూడా పిలుస్తారు.


ఈరోజున ఆయనకు ఎంతో ఇష్టమైన అటుకులు వెన్న పాలు మీగడ ఇలా అనేక రకాలు నైవేద్యంగా సమర్పిస్తారు. కృష్ణాష్టమి నాడు కేవలం భగవానుని పూజించడమే కాదు అయనలోని మంచి లక్షణాలను గ్రహించాలని పెద్దలు చెపుతారు. కృష్ణాష్టమి నాడు భక్తులంతా ఒక చోటికి చేరి ఉట్టికొట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఉట్టి కొట్టే వేడుకను భక్తులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు లీలామానుష స్వరూపుడు చిన్న వయసు నుండి ఎన్నో లీలలు ఆయన చేసాడు. శరణాగత రక్షకుడుగా పేరు గాంచిన శ్రీకృష్ణుడుని భక్తితో కొలిస్తే కోరిన కారకాలు అన్నీ తీరుస్తాడు అని అంటారు.


శ్రీకృష్ణుడి బాల్యలీలలు జీవిత విశేషాలు చాల మనోరంజకంగా ఉంటాయి. శ్రీకృష్ణుడి భక్తి తత్వాన్ని కీర్తిస్తూ చైతన్య ప్రభువు భక్తజయదేవ మీరాబాయి సూరదాసు లాంటి వారెందరో కృష్ణతత్వాన్ని ప్రజల మధ్య ప్రచారం చేసారు. కృష్ణ అవతారం గొప్పతనం గురించి పక్కకు పెడితే ప్రపంచ వ్యాప్తంగా 850 నగరాలలో విస్తరించిన ఇస్కాన్ ఆలయాల ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ ధనవంతులలో ఒకరిగా పరిగణించే ఫోర్డ్ మోటారు కంపెనీ వ్యవస్థాపకుడైన హేన్రీఫోర్డ్ మునిమనవడు ఆల్ఫ్రెడ్ బి ఫోర్డ్ ఇస్కాన్ ఉద్యమానికి ఆకర్షితుడై అంబరీష్ దాసు గా వైష్ణవ నామాన్ని స్వీకరించి ఒకవైపు తన వ్యాపారాలను చూసుకుంటూనే ప్రస్తుతం ఇస్కాన్ సంస్థల నిర్వహణా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


ధర్మసంస్థాపన చేయడానికి ప్రతియుగంలోను తాను అవతరిస్తూనే ఉంటాను అంటూ తన గీతోపదేశంలో చెప్పిన శ్రీకృష్ణుడు ఈ కలియుగంలో ఎదో ఒకరోజున మన మధ్య నడయాడటం తధ్యం..

మరింత సమాచారం తెలుసుకోండి: