'ఆచార్య'తో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ గాయానికి మందు అవుతుందని చిరుతో పాటు మెగా అభిమానులు కూడా ఆశిస్తున్న చిత్రం 'గాడ్ ఫాదర్'. మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్'కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగువాడైన తమిళ దర్శకుడు మోహన్ రాజా రూపొందించాడు. దసరా కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన  ఈ సినిమా ఎలా ఉందంటే..'గాడ్ ఫాదర్' ఒక రీమేక్ అన్న విషయాన్ని పక్కన పెట్టేసి చూస్తే.. ఇది మరీ కొత్తగా అనిపించే సినిమా కాదు. అలా అని మరీ రొటీన్ గా సాగిపోయే మసాలా మూవీ కూడా కాదు. 'లీడర్' సినిమాను కమర్షియలైజ్ చేస్తే ఎలా ఉంటుందన్నది 'గాడ్ ఫాదర్'లో చూడొచ్చు. అందులో మాదిరే ఇక్కడా ముఖ్యమంత్రి చనిపోయాక ఆయన స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే నేపథ్యంలో కథ నడుస్తుంది.ఈ సినిమాలో చిరు నడి వయస్కుడిగా కనిపిస్తూ.. రొటీన్ గా హీరోయిన్ తో రొమాన్స్ చేయకుండా.. ఫార్ములాటిక్ పాటలు.. ఫైట్లు అంటూ ఒక ఛట్రంలో ఉండిపోకుండా.. కథానుసారం సాగిపోయే కథలో ఒక పాత్రధారిగా చిరు దర్శనమివ్వడం ఆకట్టుకుంటుంది. పైన చెప్పుకున్న మసాలాలేమీ లేకపోయినా.. చిరుకు ఇందులో ఎలివేషన్లేమీ తక్కువ లేదు.


చిరు కామ్ గా కనిపిస్తున్నా పాత్రలో బలం ఉండడంతో.. చక్కటి సన్నివేశాలు పడడంతో సందర్భానుసారం అది బాగానే ఎలివేట్ అయింది.అభిమానులతో.. మాస్ ప్రేక్షకులతో విజిల్స్ కొట్టించే సన్నివేశాలకు ఇందులో లోటు లేదు.మొత్తానికి రీమేక్ మూవీ అయినా 'గాడ్ ఫాదర్' టీం మాత్రం సరిగ్గా పని చేసింది. 'లూసిఫర్'లో మూల కథతో పాటు.. అందులోని ముఖ్య పాత్రలు.. కీలక ఎపిసోడ్లను తీసుకుని.. వాటికి అదనపు పాత్రలు.. సన్నివేశాలతో పాటు మన ప్రేక్షకుల టేస్టుకు తగ్గ మసాలాలన్నీ జోడించి 'గాడ్ ఫాదర్'ను ఎంగేజింగ్ గా తీర్చిదిద్దింది. మాతృకతో పోల్చి చూసుకున్నా.. మామూలుగా చూసినా 'గాడ్ ఫాదర్' రీజనబుల్ గా అనిపిస్తుంది. ఇది మరీ ప్రేక్షకులను ఇది ఉర్రూతలూగించేసే సినిమా కాదు. కానీ రెండున్నర గంటల కాలక్షేపానికి ఢోకా లేకుండా.. మెగాస్టార్ అభిమానులకు.. మాస్ ప్రేక్షకులకు ఆద్యంతం వినోదం పంచుతూ సాగుతుంది 'గాడ్ ఫాదర్'.

మరింత సమాచారం తెలుసుకోండి: