టాలీవుడ్లో హీరోయిన్లుగా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు. వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ తమ అందచందాలతో సినీప్రియుల్ని ఆకట్టుకుంటున్నారు. అయితే వీరిలో అధిక శాతం కన్నడ కస్తూరీలే ఉండటం విశేషం. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో వీరి జోరే కొనసాగుతోంది.తెలుగు చిత్రసీమ ఎప్పుడూ ప్రతిభను గౌరవించే వేదికగా నిలుస్తోంది. అందుకే పలు భాషల నుండి నటీనటులు, సాంకేతిక నిపుణులు తెలుగు చిత్ర సీమలో సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం తెలుగులో కన్నడ భామల హవా పెరిగింది. ఇటు వెండితెరతో పాటు.. అటు బుల్లితెరపైనా కన్నడ బ్యూటీలు ఓ రేంజులో సందడి చేస్తున్నారు. అనుష్క శెట్టి నుంచి శ్రీనిధి శెట్టి వరకు, కొత్త తరం భామల వరకూ తెలుగులో కనిపించే స్టార్ హీరోయిన్‌ల్లో చాలా మంది కన్నడ మూలాలున్నవారే.ఈ క్రమంలో అనుష్క తెలుగు చిత్రసీమలో అత్యున్నత స్థాయికి చేరింది. ‘అరుంధతి, బాహుబలి’ వంటి సినిమాలతో అగ్ర తారగా వెలుగొందింది. ఇప్పటికే అనుష్క తెలుగులోనే సినిమాలను కొనసాగిస్తుంది. 

హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కు కేరాఫ్ గా నిలుస్తున్న స్వీటీ ప్రస్తుతం ‘ఘాటీ’ చిత్రాన్ని విడుదలకు ముస్తాబు చేస్తుంది.అలాగే లేటెస్ట్ గా ‘పుష్ప 2’తో సెన్సేషన్ సృష్టిస్తున్న రష్మిక.. ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లో ఒకరు. ‘పుష్ప’ సిరీస్‌తో అగ్ర కథానాయికగా ఎదిగి, టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ విజయవంతంగా అడుగులు వేస్తోంది రష్మిక. ‘పుష్ప 3’తో పాటు విజయ్ దేవరకొండ 14వ చిత్రంలోనూ రష్మిక నాయికగా నటించే అవకాశాలున్నాయి.ప్రస్తుతం అగ్ర కథానాయకుల సరసన నటిస్తున్న నూతన తారలలో ఆషికా రంగనాథ్‌, శ్రద్ధా శ్రీనాథ్‌ వంటి వారు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆషికా, చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తుండగా, శ్రద్ధా శ్రీనాథ్ బాలకృష్ణ ‘డాకు మహారాజ్‌’ లో కనిపించబోతోంది.ఇంకా ‘కె.జి.ఎఫ్‌’ ఫేమ్ శ్రీనిధి శెట్టి, నాని సరసన ‘హిట్ 3’ లోనూ.. సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ చిత్రాల్లోనూ నటిస్తుంది. ‘కాంతార’ బ్యూటీ సప్తమి గౌడ, నితిన్ ‘తమ్ముడు’ సినిమాలో మెరవబోతుంది. ‘ఇస్మార్ట్’ బ్యూటీ నభా నటేష్ నిఖిల్ ‘స్వయంభూ’లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ కన్నడ భామలు తమ నటనతో పాటు, పాత్రలలో పండే భావాలను అద్భుతంగా తెరపై ఆవిష్కరించడమే వారికి ఇక్కడ గుర్తింపు తీసుకొస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: