
తాజాగా, గుంటూరు కేంద్రంగా బ్రాహ్మణ సామాజిక వర్గం 'కన్నప్ప' సినిమా ప్రచార సరళిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టింది. సినిమా ప్రమోషన్లలో 'పిలక' వంటి పదాలను ఉద్దేశపూర్వకంగా వాడుతూ తమ సామాజిక వర్గాన్ని, సంప్రదాయాలను అగౌరవపరిచేలా, చులకన చేసేలా వ్యవహరిస్తున్నారంటూ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇది తమ మనోభావాలను దెబ్బతీయడమేనని వారు ఆరోపిస్తున్నారు.
గతంలోనూ మంచు కుటుంబ సభ్యుల నుంచి బ్రాహ్మణులను కించపరిచేలా వ్యాఖ్యలు వచ్చాయన్న ఆరోపణలున్న నేపథ్యంలో, ఇప్పుడు మళ్ళీ 'కన్నప్ప' సినిమా విషయంలో అదే తరహా వివాదం రాజుకోవడం పరిస్థితిని మరింత వేడెక్కిస్తోంది. ఈ పరిణామం చిత్ర యూనిట్‌కు కొత్త తలనొప్పిగా మారింది. కేవలం ప్రచార చిత్రాల్లోని పదజాలమే ఈస్థాయిలో అగ్గిరాజేస్తే, ఇక పూర్తి సినిమాలో ఇంకెలాంటి సన్నివేశాలున్నాయోనన్న ఆందోళన ఆయా వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఈ నిరసన గళం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని బ్రాహ్మణ సంఘాల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా వేదికగా కూడా ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదం రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, సినిమా విడుదలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్నది ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కొత్త ఉద్యమ సెగలు సినిమా భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తాయో వేచి చూడాల్సిందే.