ఒకప్పుడు వెండితెరను తన అందం, అభినయంతో ఏలిన సీనియర్ నటి.. ప్రస్తుతం యూట్యూబర్‌గా విలాసవంతమైన జీవితాన్ని ప్రపంచానికి చూపిస్తున్న ముచ్చర్ల అరుణ ఇంట అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. చెన్నైలోని ఆమె విలాసవంతమైన నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రత్యక్షమవడం సినీ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.

చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డుకు సమీపంలో ఉన్న నీలంకరై, కపాలీశ్వరనగర్‌లోని ఆమె ఇంటిపై బుధవారం తెల్లవారుజామునే పదుల సంఖ్యలో ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ ఆకస్మిక సోదాలతో ముచ్చర్ల అరుణ కుటుంబం ఉలిక్కిపడింది. ఆమె భర్త, ప్రముఖ వ్యాపారవేత్త అయిన మోహన్ గుప్తాకు సంబంధించిన వ్యాపార లావాదేవీల్లో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇంటీరియర్ డిజైనింగ్, రెసిడెన్షియల్ నిర్మాణ రంగంలో మోహన్ గుప్తా వ్యాపారాలు నిర్వహిస్తుండగా, వాటిలో అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్లు ఈడీ పసిగట్టింది.

80వ దశకంలో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో ముచ్చర్ల అరుణ ఒక వెలుగు వెలిగారు. భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన సినిమా కల్లుక్కుల్ ఈరం ఆమెకు తమిళంలో మంచి పేరు తెచ్చిపెడితే, 'సీతాకోకచిలుక', 'చంటబ్బాయ్', 'జస్టిస్ చౌదరి', 'గీతాంజలి' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మోహన్ గుప్తాతో వివాహం తర్వాత ఆమె సినీ రంగానికి పూర్తిగా దూరమయ్యారు.

ఇటీవల కాలంలో యూట్యూబ్ ఛానెల్ ద్వారా మళ్లీ వెలుగులోకి వచ్చారు. తన కుటుంబ జీవితం, విలాసవంతమైన జీవనశైలి, విదేశీ యాత్రలు, తన కుమార్తె అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి వేడుకలను వీడియోల రూపంలో పంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇంత గ్లామరస్ లైఫ్‌ను చూపిస్తున్న సమయంలోనే ఈడీ దాడులు జరగడం గమనార్హం.

అయితే ఈ సోదాల్లో ఏమైనా కీలక పత్రాలు, లెక్కల్లో చూపని నగదు లభించిందా అనే విషయంపై ఈడీ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పూర్తిస్థాయి విచారణ తర్వాతే అన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇంట్లో ఈడీ దాడుల ఘటన ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో తదుపరి ఏం జరగనుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: