
పిక్కలు పట్టేసినప్పుడు తక్షణ ఉపశమనం కోసం కొన్ని చిట్కాలు పాటించవచ్చు. ముందుగా నొప్పి ఉన్న కాలి పిక్కను మెల్లగా సాగదీయాలి. దీని కోసం, కూర్చుని లేదా నిలబడి కాలును ముందుకు చాచి, పాదాన్ని పైకి నెట్టండి, లేదా గోడకు చేతులు ఆనించి, పిక్కలు పట్టిన కాలును వెనక్కి పెట్టడం ద్వారా సాగదీయవచ్చు. సాగదీసిన తర్వాత, ఆ ప్రదేశంలో మసాజ్ చేయడం రక్త ప్రసరణను మెరుగుపరచి, కండరాన్ని సడలించడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం లేదా హాట్ ప్యాక్ ను ఆ ప్రదేశంలో ఉంచడం కూడా కండరాల సడలింపుకు ఉపయోగపడుతుంది. ఐస్ ప్యాక్ లేదా ఐస్ క్యూబ్‌లను ఉపయోగించడం వలన నొప్పి, వాపు తగ్గుతాయి.
దీర్ఘకాలికంగా పిక్కల పట్టే సమస్యను నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం, ముఖ్యంగా వ్యాయామం చేసిన తర్వాత లేదా వేడి వాతావరణంలో ఉన్నప్పుడు ఈ పని చేయాలి. ఆహారంలో పొటాషియం సమృద్ధిగా ఉన్న అరటిపండ్లు, ఆకుపచ్చ కూరగాయలు మెగ్నీషియం ఉన్న నట్స్, సీడ్స్, డార్క్ చాక్లెట్ మరియు కాల్షియం ఉన్న పాలు, పెరుగు, పనీర్ లాంటి ఆహారాలను చేర్చుకోవాలి. అవసరమైతే, వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్లను తీసుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ముఖ్యంగా కాలి కండరాలకు సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల కండరాలు బలంగా మారి, వాటి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.
అయితే, వ్యాయామం ముందు, తర్వాత కండరాలను సరిగ్గా సాగదీయడం ముఖ్యం. నిద్రపోయే ముందు కాలి పిక్కలను సాగదీయడం అలవాటు చేసుకోవడం రాత్రిపూట పట్టేయడాన్ని నివారిస్తుంది. సౌకర్యవంతమైన బూట్లు ధరించడం, ఎక్కువసేపు ఒకే భంగిమలో నిలబడటం లేదా కూర్చోవడం మానుకోవడం కూడా సహాయపడుతుంది. ఒకవేళ పిక్కలు పట్టేయడం తరచుగా జరుగుతూ, తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంటే, లేదా ఇతర లక్షణాలతో కూడి ఉంటే, వైద్యుడిని సంప్రదించడం అవసరం