
ముంబైకి చెందిన వ్యాపారవేత్త, లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ దీపక్ కొఠారీ శిల్పా శెట్టి దంపతులపై ఫిర్యాదు చేశాడు. 2015 - 2023 మధ్య వ్యాపార విస్తరణ పేరుతో తన వద్ద నుంచి రూ. 60.48 కోట్లు తీసుకున్నారని.. అయితే ఆ నిధులను వారు తమ సొంత ఖర్చులకు వాడుకున్నారని దీపక్ కొఠారీ ఆరోపణలు చేశారు.
బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ అనే హోమ్ షాపింగ్ కంపెనీకి శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా డైరెక్టర్లుగా ఉన్న టైమ్‌లో 12 శాతం వడ్డీతో రూ. 75 కోట్ల రుణం కావాలని వారు కోరారని, ఆ తర్వాత పన్నుల భారం నుంచి తప్పించుకునేందుకు రుణం బదులుగా పెట్టుబడిగా ఇచ్చేలా తనను ఒప్పించారని కొఠారీ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. నెలవారీ రాబడితో పాటు అసలు కూడా తిరిగి చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో.. 2015 ఏప్రిల్‌లో రూ. 31.9 కోట్లు, అదే ఏడాది సెప్టెంబర్‌లో మరో రూ. 28.53 కోట్లు బదిలీ చేశానని తెలిపారు.
అయితే వ్యక్తిగత గ్యారెంటీ ఇచ్చిన శిల్పా శెట్టి 2016 సెప్టెంబర్‌లో కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని.. 2017లో కంపెనీ దివాలా తీసిందని.. దాంతో తనకు తీవ్ర నష్టం కలిగిందని కొఠారీ వాపోయారు. అతని ఫిర్యాదుతో జుహు పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి శిల్పా శెట్టి దంపతులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం కేసును ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.