
ఖైదీ నెం.150 (కత్తి తమిళ్ రీమేక్) భారీ హిట్ అయ్యింది. ఆ విజయమే చిరంజీవికి రీమేక్‌లపై మరింత నమ్మకాన్ని కలిగించింది. అందులో భాగంగానే `గాడ్ ఫాదర్` చేశారు. మలయాళం సూపర్ హిట్ `లూసిఫర్`కు తెలుగు రీమేక్ ఇది. 2022లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. కానీ సినిమా అంచనాలకు తగ్గ రేంజ్‌లో విజయం సాధించలేదు. ఫలితంగా గాడ్ ఫాదర్ నిర్మాణంలో భాగమైన రామ్ చరణ్ గట్టిగానే నష్టపోయాడు.
అయిన కూడా చిరంజీవికి రీమేక్ మూవీస్‌పై మక్కువ తగ్గలేదు. మళ్లీ `భోళా శంకర్` చేశారు. తమిళంలో విజయం సాధించిన `వేదాళం` చిత్రానికి రీమేక్ ఇది. మేహర్ రమేష్ డైరెక్టర్ కాగా.. తమన్నా హీరోయిన్‌గా, కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటించారు. 2023లో రిలీజ్ అయిన ఈ మూవీ చిరు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఇక భోళా శంకర్ దెబ్బతో చిరంజీవి తప్పు తెలుసుకున్నారు. అప్పటి నుంచి రీమేక్ సినిమాలంటే నిర్మొహమాటంగా నో చెప్పేస్తున్నారట. రీమేక్ సినిమాల జోలికి వెళ్లకుండా, ఒరిజినల్ కథలపై దృష్టి సారించాలని మెగాస్టార్ నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రాజెక్ట్స్‌లోనూ ఎక్కువగా కొత్త కథలే ఉంటున్నాయి. కాగా, ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో `మన శంకర వర ప్రసాద్ గారు`, వశిష్ఠ దర్శకత్వంలో `విశ్వంభర` చిత్రాలు చేస్తున్నారు. బాబీతో ఒక సినిమా, శ్రీకాంత్ ఓదెలతో ఒక చిత్రం లైన్‌లో ఉన్నాయి. ఇవన్నీ స్ట్రైట్ స్టోరీసే కావడం విశేషం.