దర్శకుడు క్రిష్‌ అంటే సినీప్రియుల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సాధారణ కమర్షియల్ ఫార్ములాలను పక్కనబెట్టి, సమాజానికి ఆలోచన రేకెత్తించే సినిమాలను తీర్చిదిద్దిన దర్శకుడిగా ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ వంటి చిత్రాలు ఇప్పటికీ కల్ట్ ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నాయి. 2015లో వచ్చిన ‘కంచె’ తో ఆయన తన ముద్రను మరింత బలపరిచారు. అలాగే 2017లో బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ని తెరకెక్కించి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఆ తరువాత క్రిష్ కెరీర్‌లో కొన్ని మ‌ర‌క‌లు పడ్డాయి. బాలీవుడ్ సినిమా ‘మణికర్ణిక’ నుంచి మధ్యలోనే బయటకు రావాల్సి రావడం, దాని ఫలితంగా కంగనా రనౌత్‌తో డైరెక్షన్ క్రెడిట్ పంచుకోవాల్సి రావడం ఆయన ఇమేజ్‌కు డ్యామేజ్ అయిన‌ట్ల‌య్యింది. ఆ సినిమా ఆడ‌లేదు.


తర్వాత బాలయ్యతో చేసిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలు భారీ అంచనాలను అందుకోలేకపోయాయి. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ అద్భుతమైన నటన ప్రదర్శించినా, క్రిష్ ట్రీట్‌మెంట్ మాత్రం ‘మహానటి’ తరహా స్థాయిని అందుకోలేకపోయింది. ఆ వెంటనే వచ్చిన ‘కొండపొలం’ కూడా విఫలమైంది. చదవడానికి గొప్పగా అనిపించే నవలని తెరపైకి తీసుకురావడంలో క్రిష్ తడబడటమే కాక, హీరోగా వైష్ణవ్ తేజ్‌ని ఎంపిక చేయడం ఆడియన్స్‌కు నచ్చలేదు. అంతలోనే ‘హరిహర వీరమల్లు’ ప్రాజెక్టు చుట్టూ కూడా అనేక ఇబ్బందులు తలెత్తాయి. ప్రొడక్షన్ డిలేలు, సాంకేతిక సమస్యల కారణంగా ఆ సినిమా స‌క్సెస్ కాలేదు. ఈ సినిమా ప‌రాజ‌యంలో మేజ‌ర్ క్రెడిట్ క్రిష్‌ది కాక‌పోయినా క‌థ‌, స‌గం డైరెక్ష‌న్ బాధ్య‌త క్రిష్‌దే.


క్రిష్ ప్లాపుల పరంపరలో తాజా సినిమా ‘ఘాటీ’ కూడా చేరింది. గంజాయి స్మగ్లింగ్ నేపథ్యాన్ని ఎంచుకున్న క్రిష్, తన సెన్సిబిలిటీకే దూరంగా వెళ్ళి, సరైన ట్రీట్‌మెంట్ ఇవ్వలేకపోయారు. అనుష్క విశ్వరూపం చూపిస్తారని చెబుతూ వచ్చి, చివరికి తన దర్శకత్వ విశ్వరూపాన్ని మ‌ర‌చిపోయార‌నే అంద‌రూ అంటున్నారు. ఇప్పుడు బాల‌య్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 999 మ్యాక్స్‌ను కూడా క్రిష్ తెర‌కెక్కిస్తార‌ని వార్తలు వ‌స్తున్నాయి. మ‌రి ఈ సినిమాతో అయినా క్రిష్ స‌క్సెస్ అవుతాడేమో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: