తెలుగు సినిమా పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన పేరు ధర్మవరపు సుబ్రమణ్యం. రంగస్థలం నుంచి ప్రయాణం మొదలు పెట్టి, వందలాది సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన ఆయన, టాలీవుడ్‌లో ఒక ప్రత్యేకమైన కమెడియన్‌గా తన ముద్ర వేశారు. తన హాస్య టైమింగ్, మాస్సీ డైలాగ్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆడియెన్స్ గుండెల్లో స్థానం సంపాదించుకున్న ధర్మవరపు, వెండితెరపైనే కాదు, బుల్లితెరపైనా అదరగొట్టారు. తన నటనతో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. అయితే తన కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే లివర్ క్యాన్సర్ బారిన పడి 2013లో కన్నుమూశారు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు దాదాపు 12 ఏళ్లైనా, ఆయన జ్ఞాపకాలు అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం ఇప్పుడు బయటకు వచ్చింది – ధర్మవరపు ఆఖరి కోరిక నెరవేరలేదని ఆయన సతీమణి కృష్ణజ కన్నీటి కళ్ళతో వెల్లడించారు.


ఆమె చెప్పిన వివరాల ప్రకారం – “ఆఖరి రోజుల్లో మా ఆయన చిన్న పిల్లాడిలా ఏడ్చేవారు. ‘నా మనవళ్లను ఒకసారి చూడాలని ఉంది’ అని పదే పదే చెప్పేవారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. మా గుండె తరుక్కుపోయింది” అని భార్య భావోద్వేగానికి లోనయ్యారు. అదే సమయంలో ధర్మవరపు తన రెండో కుమారుడు రవి బ్రహ్మ తేజ దగ్గర ఒక మాట తీసుకున్నారట. “నువ్వు నా బాటలోనే నడవాలి.. నా పేరు ఇండస్ట్రీలో నిలబెట్టాలి” అని. పెద్ద కొడుకు సందీప్ వ్యాపార రంగంలో స్థిరపడ్డాడు. కానీ తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో తేజ ఉద్యోగాన్ని వదిలేసి సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. అయితే ఇప్పటి వరకు ఆయనకు సరైన అవకాశాలు రాలేదు.



ధర్మవరపు భార్య మాట్లాడుతూ – “మా భర్తలాగే మా కొడుకు తేజ కూడా మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకోవాలని మా కల. ఆయన ఆఖరి కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాం” అంటూ ఎమోషనల్‌గా తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. అభిమానులు కూడా ధర్మవరపు ఆఖరి కోరిక నెరవేరలేదని చాలా ఫీల్ అవుతున్నారు. దర్శక నిర్మాతలు పెద్ద మనసుతో ఆయన కుమారుడికి అవకాశాలు కల్పించాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లోనైనా ధర్మవరపు ఆఖరి కోరిక నెరవేరుతుందా? ఆయన కొడుకు రవి బ్రహ్మ తేజ కూడా తండ్రిలాగే నవ్వులు పూయించి, ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదిస్తాడా? అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: