ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదం రాజుకుంటున్న వేళ.. తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో అసలే శ్రీశైలంలో తక్కువగా ఉన్న నీటిని తెలంగాణ వృథా చేస్తోందన్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై స్పందించిన కేసీఆర్.. అసలు ఏపీ, తెలంగాణ మధ్య జల విద్యుత్‌ విషయంలో ఎలాంటి ఒప్పందాలు లేవన్నారు. అందుకే.. విద్యుత్ ఉత్పత్తిపై కృష్ణా బోర్డు జోక్యం చేసుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు.


కృష్ణా జలాలను తెలంగాణ వృథా చేస్తున్నామనేది కేవలం ఏపీ చేస్తున్న దుష్ప్రచారం మాత్రమేనన్న కేసీఆర్.. దాన్ని తిప్పికొట్టాలని అధికారులకు సూచించారు. కావాలంటే పులిచింతల నుంచి విడుదలైన నీటిని ఏపీ ప్రభుత్వం వాడుకోవచ్చని కేసీఆర్ అన్నారు. ప్రకాశం బ్యారేజీకి వచ్చే నీటితో ఏపీ తమ అవసరాలను తీర్చుకోవాలని కేసీఆర్ సూచించారు. అంతే కాదు.. తెలంగాణకు ప్రస్తుతం జలవిద్యుత్ ఉత్పత్తి ఎంత అవసరమో చెప్పే ప్రయత్నం చేశారు.


కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి గోస తీర్చిందన్న సీఎం కేసీఆర్.. భవిష్యత్‌లో కృష్ణా, గోదావరిపై మరిన్ని ప్రాజెక్టులు నిర్మిస్తామని స్పష్టం చేశారు. బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటై 17 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటా  నిర్ధారించలేదని గుర్తు చేశారు. బేసిన్ అవసరాలు తీరాకే ఇతర ప్రాంతాలకు నీరు అనేది సహజ న్యాయమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల వల్ల జలవిద్యుత్ అవసరం పెరిగిందన్న కేసీఆర్.. జల విద్యుత్‌తో లిఫ్టులు నడిపి సాగునీరు ఎత్తిపోసుకుంటున్నామని గుర్తు చేశారు.


ఇక పోతిరెడ్డిపాడుపై స్పందించిన కేసీఆర్.. ఈ ప్రాజక్టుకు వరద జలాలనే వాడుకుంటామని గతంలో వైఎస్‌ అన్నారని గుర్తు చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు కూడా గతంలో వైఎస్ అదే విషయం చెప్పారన్నారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతోందన్న కేసీఆర్..
51శాతం 'క్లీన్ ఎనర్జీ'ని ఉత్పత్తి చేయాలని కేంద్రమే చెబుతోందన్నారు సీఎం కేసీఆర్.


మరింత సమాచారం తెలుసుకోండి: