
అయితే ఏపీలో సైతం జగన్ త్వరలో ఉపఎన్నికలు పెట్టడానికి సిద్ధమవుతున్నారని, అందుకే ఈ జల జగడంలోకి తమ పార్టీని లాగి ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణించడంతో, ఆ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక ఆ స్థానంతో పాటు మరో ఐదు చోట్ల జగన్ ఉపఎన్నికలకు ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు.
టీడీపీ తరుపున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు వెళ్ళిన విషయం తెలిసిందే. వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్, మద్దాలి గిరిలు వైసీపీలోకి వెళ్లారు. ఇక ఆ నలుగురి చేత రాజీనామా చేయించి, ఉపఎన్నికల్లో పోటీ చేయించాలని జగన్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం గంటా శ్రీనివాసరావు సైతం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్‌ని కూడా కలిసి తన రాజీనామాని ఆమోదించాలని కోరారు. దీంతో గంటా రాజీనామాని ఆమోదించి ఉపఎన్నికలు పెట్టడానికి చూస్తున్నారని తెలుస్తోంది.
పైగా ఆ ఐదు టీడీపీ సిట్టింగ్ స్థానాలు. గత ఎన్నికల్లో వారు టీడీపీ తరుపున గెలిచారు. కాబట్టే నీటి సెంటిమెంట్‌తో టీడీపీని దెబ్బకొట్టి లబ్ది పొందాలని జగన్ చూస్తున్నారని మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్తితుల్లో వైసీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించడం, గంటా రాజీనామాని ఆమోదించడం చేసి, ఉపఎన్నికలకు వెళితే జగన్‌కే అడ్వాంటేజ్ అయ్యేలా కనిపిస్తోంది. మరి చూడాలి జగన్ వారి చేత రాజీనామా చేయించి ఉపఎన్నికలకు వెళ్తారేమో.