ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు విజయనగరం జిల్లా రాజకీయాలపై ఎంత పట్టు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జిల్లాలో సగం నియోజకవర్గాల్లో ఈయన మీద ఆధారపడే రాజకీయాలు నడుస్తాయి. బొత్స ఏ పార్టీలో ఉంటే, ఆ నియోజకవర్గాల్లో ఆ పార్టీ జెండా ఎగరడం ఖాయం. అలాగే ఆయనకు సంబంధించిన వ్యక్తులే ఎమ్మెల్యేలుగా ఉంటారు.

దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేసినప్పుడు జిల్లాపై బొత్సకు గట్టి పట్టు ఉండేది. ఆయన బంధువులు, సన్నిహితులకే టికెట్లు వచ్చేవి. అలాగే వారిని గెలిపించుకోవడంలో బొత్స పాత్ర బాగానే ఉండేది. ఇక బొత్స వైసీపీలోకి వచ్చాక కూడా అదే ట్రెండ్ కొనసాగుతుంది. జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో బొత్సకు సంబంధించినవారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు కాస్త పట్టు కోల్పోతున్నా సరే బొత్స వర్గం మాత్రం స్ట్రాంగ్‌గా ఉంది.

గత ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గం నుంచి గెలిచిన విషయం తెలిసిందే. ఇక ఇక్కడ బొత్సకు చెక్ పెట్టడం టీడీపీకి అసలు సాధ్యం కాదనే చెప్పొచ్చు. ఒకవేళ రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్నా సరే చీపురుపల్లిలో బొత్సని దెబ్బకొట్టడం కష్టం. అటు గజపతినగరంలో బొత్స సోదరుడు అప్పలనరసయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ కూడా నరసయ్య చాలా స్ట్రాంగ్‌గానే ఉన్నారు. ఈ స్థానంలో టీడీపీ, నరసయ్యకు చెక్ పెట్టడం కష్టమే.

వైసీపీకి కీలకంగా ఉన్న నెల్లిమర్ల నియోజకవర్గంలో బొత్స  సత్యనారాయణ దగ్గర బంధువు బద్దుకొండ అప్పలనాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. బొత్సతో పాటే రాజకీయం చేస్తూ వస్తున్న అప్పలనాయుడు, కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చి గత ఎన్నికల్లో సత్తా చాటారు. నెల్లిమర్లలో ప్రస్తుతం అప్పలనాయుడుదే పైచేయి. అలాగే బొత్స సన్నిహితులైన అలజంగి జోగారావు... పార్వతీపురం నియోజకవర్గంలో, కడుబండి శ్రీనివాసరావు...శృంగవరపుకోట నియోజకవర్గంలో బలంగా ఉన్నారు. ఏదేమైనా విజయనగరం జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ వర్గం హవా ఉందని చెప్పొచ్చు. అలాగే వారికి టీడీపీకి చెక్ పెట్టడంలో వెనుకబడి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: