ఇప్పుడు ఏపీలో అధికార వైఎస్సార్ సీపీకి తిరుగులేని బలం ఉందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ వైసీపీ అదిరిపోయే మెజారిటీతో అధికారంలోకి వస్తుందని గట్టిగానే చెప్పేయొచ్చు. ఇదే పరిస్తితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటడం ఖాయమని, కానీ మళ్ళీ ఎన్ని సీట్లు వస్తాయి? ఎంతమంది వైసీపీ తరుపున గెలుస్తారు? అనే అంశం చెప్పలేకపోయినా వైసీపీకైతే ఆధిక్యం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరి టీడీపీ తరుపున ఎంతమంది గెలుస్తారనే విషయం కూడా చెప్పలేమని, కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారిలో కొందరు మాత్రం ఓడటం ఖాయమని అంటున్నారు. ఎందుకంటే అధికారంలో వైసీపీ ఉండటంతో కొందరు ఎమ్మెల్యేలు సైలెంట్‌గా ఉంటున్నారు. పోనీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ప్రజల మధ్యలో ఉంటూ, వారి సమస్యలపై పోరాటం కూడా చేయడం లేదు. ఇలా ఉన్న ఎమ్మెల్యేలు మళ్ళీ గెలవలేరని అంటున్నారు.

మరి అలా గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నవారిలో గంటా శ్రీనివాసరావు ముందు వరుసలో ఉంటారని చెబుతున్నారు. ఎన్ని పార్టీలు మారినా, ఎన్ని నియోజకవర్గాలు మారినా ఇంతవరకు గంటాకు ఓటమి ఎదురుకాలేదు. కానీ ఈసారి గంటాకు దెబ్బపడటం ఖాయమని అంటున్నారు. అసలు ప్రజాప్రతినిధిగా గంటా తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడం లేదు...అందుబాటులో ఉండటం లేదు. గత ఎన్నికల్లో ఈయన విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా గెలవగా, ఈ సారి ఎక్కడ నుంచి బరిలో ఉంటారు? ఏ పార్టీ తరుపున పోటీ చేస్తారనే అంశాలు బట్టి గంటా గెలుపు ఆధారపడి ఉంది.

అటు ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్‌కు కూడా అంత అనుకూల వాతావరణం లేదని తెలుస్తోంది. ఇటు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణకు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లకు కూడా కాస్త గడ్డు పరిస్తితులు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే రేపల్లెలో అనగాని సత్యప్రసాద్‌కు కూడా ఈసారి గెలుపు అంత సులువు కాదని తెలుస్తోంది. అటు ఉరవకొండలో పయ్యావుల కేశవ్ పరిస్తితి కూడా అంతంత మాత్రమే ఉందని తెలుస్తోంది. కానీ వచ్చే ఎన్నికల్లోపు వీరు పుంజుకుంటే టీడీపీకే అనుకూల వాతావరణం ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: