తెలుగుదేశం పార్టీకి ఊహించని ఓటములు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పంచాయితీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో టి‌డి‌పి చిత్తు అవ్వగా, తాజాగా ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి స్థానాల్లో కూడా దారుణంగా ఓడిపోయింది. విచిత్రం ఏంటంటే టి‌డి‌పి బలంగా ఉండే మండలాల్లో కూడా వైసీపీ హవా కొనసాగింది. ఇక్కడ మరి విచిత్రం ఏంటంటే టి‌డి‌పికి మొదట నుంచి సపోర్ట్‌గా ఉన్న కమ్మ వర్గం బలంగా ఉన్న మండలాల్లో కూడా టి‌డి‌పి అభ్యర్ధులు చేతులెత్తేశారు. అంటే సొంత వర్గం వాళ్లే చంద్రబాబుకు దెబ్బవేసినట్లు కనిపిస్తోంది.

ముఖ్యంగా కమ్మ వర్గం ప్రభావం ఎక్కువగా ఉండే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ దుమ్ములేపింది. మిగిలిన జిల్లాల్లో పరిస్తితి ఎలా ఉన్నా..ఈ రెండు జిల్లాల్లోనైనా టి‌డి‌పి సత్తా చాటుతుందని తమ్ముళ్ళు అనుకున్నారు. కమ్మ వర్గం హవా ఉండటం, రాజధాని అంశం కూడా కలిసొస్తుందని భావించారు. కానీ ఏది వర్కౌట్ కాలేదు. రెండు జిల్లాల్లో దారుణమైన ఫలితాలే వచ్చాయి.

ముఖ్యంగా కమ్మ వర్గం ప్రభావం ఉండే కృష్ణా జిల్లాలోని.. పెనమలూరు, గన్నవరం, గుడివాడ, నూజివీడు, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల్లో టి‌డి‌పికి దారుణ ఫలితాలు వచ్చాయి. అసలు కృష్ణా జిల్లాలో ఒక జెడ్‌పి‌టి‌సి స్థానం మాత్రమే టి‌డి‌పి గెలుచుకుంది. 40 స్థానాలు వైసీపీ గెలుచుకుంది. ఒక గుడివాడలో టి‌డి‌పికి గుండు సున్నా మిగిలింది. ఒక ఎం‌పి‌టి‌సి కూడా గెలుచుకోలేదు.

అటు గుంటూరు జిల్లాలో కూడా టి‌డి‌పిది అదే పరిస్తితి..చిలకలూరిపేట, పొన్నూరు, వినుకొండ, గురజాల, పెదకూరపాడు, నరసారావుపేట, సత్తెనపల్లి స్థానాల్లో చిత్తు అయింది. ఒక్క మంగళగిరిలోనే సత్తా చాటింది. ఇక ఈ జిల్లాలో ఒక్క జెడ్‌పి‌టి‌సి కూడా టి‌డి‌పి గెలుచుకోలేదు. అంటే జిల్లాలో పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లోనూ టి‌డి‌పికి చుక్కలు కనిపించాయి. ఇప్పుడు ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టిసి ఎన్నికల్లో అదే పరిస్తితి. అంటే సొంత సామాజికవర్గం వాళ్ళు కూడా టి‌డి‌పికి సపోర్ట్‌గా నిలవలేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp