కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు.. విశాఖప‌ట్నంలో నిత్యం విజ‌య‌సాయిరెడ్డి మాటే వినిపించేది. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు.. ప్ర‌భుత్వంలో ప‌నిచేసే అధికారులు అంద‌రూ.. తెల్ల‌వారిలేస్తే.. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు క్యూక‌ట్టేవారు. అన్నీ ఆయ‌న చేతుల మీదుగానే జ‌రిగేవి.. ఆయ‌నే ద‌గ్గ‌రుండి.. అన్నీ చేయించేవారు.. అనే టాక్ కూడా ఉండేది. అంతేకాదు.. విశాఖ‌లో ఏం జ‌ర‌గాల‌న్నా.. క‌నీసం ఇటు పుల్ల‌తీసి.. అటు పెట్టాల‌న్నా.. కూడా సాయిరెడ్డి ఆదేశాలు.. అనుజ్ఞ ఉండాల‌నే పేరు వ‌చ్చింది. అయితే.. గ‌త రెండు మాసాలుగా విశాఖ‌లో అస‌లు సాయిరెడ్డి ఊసు వినిపించ‌డం లేదు. ఆయ‌న ధ్యాస‌కూడా ఇక్క‌డ మ‌రిచిపోయార‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రి దీనికి కార‌ణ‌మేంటి? అనేది ఆస‌క్తిగా మారింది.

అధికార పార్టీ వైసీపీలో నెంబ‌ర్ 2 నేత‌గా ఎదిగిన సాయిరెడ్డి.. సీఎం జ‌గ‌న్ త‌ర్వాత‌.. సీఎంగా చ‌క్రం తిప్పారు. ఉత్త‌రాంధ్ర జిల్లాల ఇంచార్జ్‌గా కూడా ప‌నిచేస్తున్నారు. రాజ‌కీయంగా ఇక్క‌డ ఎలాంటి మార్పులు రావాల‌న్నా.. ఏం చేయాల‌న్నా.. ఆయ‌నే నిర్ణ‌యం తీసుకుంటున్నారు. అయితే.. ఇది గ‌తం. ఇప్పుడు ఇక్క‌డ పార్టీ కార్య‌క్ర‌మాల‌ను వైవీ సుబ్బారెడ్డి నిర్వ‌హిస్తున్న‌ట్టు పార్టీలోనే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి కార‌ణం.. ఒక‌టికాదు.. నాలుగు అంటున్నారు ప‌రిశీల‌కులు. అటవీ భూముల‌ను ఆక్ర‌మించుకున్న వ్య‌వ‌హారంలో సాయిరెడ్డిపేరు ప్ర‌ముఖంగా వినిపించింది.

అదే స‌మ‌యంలో త‌న అల్లుడు పార్ట‌న‌ర్‌గా ఉన్న హెటిరో సంస్థ‌కు ఇక్క‌డి భూముల‌ను అప్ప‌గించార‌నే వాద‌న కూడా ఉంది. వీటికితోడు పార్టీ ఎదుగుద‌ల‌కు ఎంతో కృషి చేసిన కార్య‌క‌ర్త‌ల‌ను సైతం సాయిరెడ్డి తొక్కేస్తున్నార‌నే ఆవేద‌న జోరుగా నే వినిపించింది. మంత్రి అవంతి శ్రీనివాస‌రావు, ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ ప్ర‌భావం కూడా లేకుండా పోయింద‌ని.. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో అన్నీతానై వ్య‌వ‌హ‌రించార‌ని.. దీనివ‌ల్ల పార్టీ విజ‌యం అయితే సాధించినా.. అనుకున్న విధంగా మెజారిటీ రాలేద‌ని.. ఒక టాక్ ఉంది.

ఈ ప‌రిణామాల‌కు తోడు.. విజ‌యసాయి నేతృత్వంలో ప‌నిచేసేందుకు ఇక్క‌డి నాయ‌కులు విముఖ‌త చూపుతుండ‌డం.. దీనిపై అధిష్టానానికి సైతం ఫిర్యాదులు అంద‌డంతోనే ఆయ‌న‌ను కొన్నాళ్లుగా ప‌క్క‌న పెట్టార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికితోడు.. ఢిల్లీలో చ‌క్రం తిప్పిన సాయిరెడ్డి.. అనుకున్న విధంగా ప‌నిచేయ‌లేక పోతున్నార‌నేవాద‌న కూడా ఉంది. దీంతో అధిష్టానం సాయిరెడ్డి ప‌నితీరుపై అసంతృప్తితో ఉంద‌ని.. అందుకే ఆయ‌న సైలెంట్ అయ్యార‌ని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: