ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం పేట్రేగిపోతున్నదని, పోలీసులను ఇష్టారీతిగా  జగన్ ప్ర‌భుత్వం వాడుతున్న‌ద‌ని.. ప్రతిపక్ష నేతలపై శారీరక, మానసిక, ఆర్థికపరమైన దాడులకు పాల్ప‌డుతోందని టీడీపీ నేత చంద్రబాబు ఆరోపించారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆర్టికల్ 356  విధిస్తే పరిస్థితులు దారికి వ‌స్తాయ‌ని, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు విజ్ఞప్తి చేశారు చంద్ర‌బాబు.  మూడు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఢిల్లీకి వచ్చారు. ఏపీ ప్ర‌భుత్వం యొక్క‌ అతివాద చర్యలపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేశారు. ఐదుగురు కీలక నేతల బృందంతో రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను క‌లిశారు. ఆ త‌రువాత రాజ్ భవన్ వద్ద చంద్రబాబు మీడియాతో  ముచ్చ‌టించారు.

రాష్ట్రప‌తికి ఏపీలో జ‌రుగుతున్న దాడుల గురించి తాము ఫిర్యాదు చేశామ‌ని..  ఫిర్యాదులపై రాష్ట్రపతి స్పందించిన తీరు, జగన్ ను అడ్డుకోకపోతే దేశ భవిష్యత్ ఎలా నాశనం కాబోతున్న‌దో చంద్రబాబు వెల్ల‌డించారు. ఏపీలో చోటుచేసుకుంటున్న‌ పరిణామాలను రాష్ట్రపతికి పూసగుచ్చినట్లు వివరించామని, ఏ చిన్న విషయాన్నీ కూడ‌ వదిలిపెట్టకుండా జగన్ ఉగ్రచర్యలపై తయారు చేసిన పుస్తకాన్నిఅందించామని వివ‌రించారు.  పోలీసుల అండతో ఏపీలో ప్రభుత్వ ఉగ్రవాదం కొనసాగుతొంద‌న్నారు.  రాజకీయ పోరాటాలకు తావు లేని విధంగా పరిస్థితులు దిగజారాయని, ప్రతిపక్షం గొంతుకనే కాకుండా ప్రజల ప్రాథమిక హక్కులను కూడ  మంట‌గ‌లుపుతుంద‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వ తీరుపై రాష్టపతికి తెలిపామని వివ‌రించారు.

దేశ చరిత్ర‌లో ఎన్న‌డూ చూడ‌ని దుష్ట సంప్ర‌దాయానికి సీఎం జ‌గ‌న్ తెర‌లేపాడ‌ని పేర్కొన్నారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కులైన మ‌మ్ముల్నీ శారీర‌కంగా, మాన‌సికంగా, ఆర్థికంగా దెబ్బ‌తీస్తున్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ టీడీపీ నాయ‌కుల‌ను తీవ్రంగా వేధిస్తున్నాడు. గ‌తంలో పులివెందుల‌లో రాజారెడ్డి కూడ ఇదేవిధంగా వ్య‌వ‌హ‌రించేవాడ‌ట‌. ప్ర‌త్య‌ర్థుల ఆర్థిక మూలాల‌ను కూల్చివేస్తే మాట్లాడ‌కుండా ఉంటార‌న్న‌ది వైఎస్ కుటుంబం విధాన‌మని పేర్కొన్నారు. వీటికి మేము బెదిరిపోము. ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌డం కోస‌మే ఇవాళ నేను ఢిల్లీకి వ‌చ్చాన‌ని తెలిపారు. ఏపీలో ప్ర‌భుత్వ‌మే ఉగ్ర‌చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంద‌నే ఆధారాల‌ను రాష్ట్రప‌తికి అంద‌జేశాం. ఆర్టిక‌ల్ 356ని అమలు చేయాల‌ని కోరినట్టు తెలిపారు. చంద్ర‌బాబు ఫిర్యాదుతో రాష్ట్రప‌తి సానుకూలంగా స్పందించారు. న్యాయం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని రాష్ట్రప‌తి పేర్కొన్నాడని చంద్ర‌బాబు వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: