కడప జిల్లా బద్వేల్ లో ఉపఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికలలో మొత్తం 68.12శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. గత సార్వత్రిక ఎన్నికలలో పోలింగ్ దాదాపుగా 77 శాతంగా నమోదైంది. అంటే గతంలో జరిగిన పోలింగ్ కంటే 8.25 శాతం తక్కువ.. అన్ని పార్టీలు ప్రచారం చేసినా.. అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేసినా ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాలకు రాలేదు. సాధారణంగానే ఉప ఎన్నికలంటే ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపించరు. దీనికి తోడు బద్వేల్ ఎన్నికల బరిలో టీడీపీ, జనసేన లేక పోవడంతో, పోటీ మొత్తం వైసీపీ, బీజేపీల మధ్యే జరిగింది. ఇది కూడా ఒకరకంగా పోలింగ్ శాతం తగ్గడానికి కారణంగా భావిస్తున్నారు.

ఇక హుజూరాబాద్ ఎన్నికల విషయానికి వస్తే అక్కడ ఎన్నికలు హోరాహోరీగానే జరిగినట్టు తెలుస్తోంది. దాదాపుగా 86.57 శాతం పోలింగ్ నమోదు అయినట్టు అధికారులు చెబుతున్నారు. 2018 సార్వత్రిక ఎన్నికల కంటే ఇప్పుడు 2.5 శాతం ఓటింగ్ పెరిగింది. దీనిని బట్టి చూస్తే హుజూరాబాద్ లో ఓటర్ల చైతన్యం బాగానే కనిపిస్తోంది. దీనికి తోడు టీఆర్ఎస్, బీజేపీలు ఈ ఎన్నికల కోసం సర్వశక్తులూ ఒడ్డి పోరాడాయి. ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కి.. కోట్లాది రూపాయలు పంచిపెట్టారు. ఒక్కో ఓటుకు ఆరు వేల నుంచి, పది వేల రూపాయల వరకూ ఇస్తున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇలా నగదు పంచడం కూడా పోలింగ్ శాతం భారీగా పెరిగేందుకు కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే బద్వేల్ ఉపఎన్నికలలో వైసీపీ వ్యూహాలు ఫలించాయా..? అంటే మాత్రం లేదనే చెప్పాలి. మంత్రులు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో ప్రచారం చేయించినా ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాలకు రాలేదు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. తమ సంక్షేమ పథకాలే ప్రజలను పోలింగ్ కేంద్రాలకు నడిపిస్తాయని వైసీపీ అధిష్టానం భావించింది. అయితే జనం మాత్రం సంక్షేమ పధకాలను తీసుకుంటూనే తమ బద్ధకం చూపించారు. సరిగ్గా పోలింగ్ రోజున ఓటు వేసేందుకు రాకుండా డుమ్మా కొట్టేశారు. గెలుపోటముల సంగతి పక్కన పెడితే..  వైసీపీ వ్యూహాలు మాత్రం బద్వేల్ ఉపఎన్నికలలో ఫలించలేదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: