పార్టీ పటిష్టం కోసం ఎవరైనా కమిటీలు వేసుకుంటారు. కానీ ఏపీ బీజేపీ మాత్రం చేరికలకోసం ఓ కమిటీ వేసుకుంది. అంటే పార్టీ బలపడటం అంతా చేరికలతోనే ఉంటుందని ఏపీ నాయకులు డిసైడ్ అయినట్టున్నారు. అందులోనూ అమిత్ షా ఇటీవల తిరుపతి వచ్చినప్పుడు అందరికీ తలంటారు. పార్టీలో చేరికలేవి? ఏం చేస్తున్నారు, ఏయే జిల్లాలో ఎంతమంది కీలక నాయకులున్నారని ప్రశ్నించారు. దీంతో రాష్ట్ర నాయకత్వం హడావిడి పడింది.

రండి రండి రండి..
2019 ఎన్నికల తర్వాత టీడీపీలో తలదాచుకోడానికి వీలు లేక, రాజ్య సభ సభ్యులు మూకుమ్మడిగా బీజేపీ బాట పట్టారు. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో చేరికలు లేవు. మరోవైపు జనసేనతో పొత్తు పెట్టుకోవడంతో ఏ పార్టీలో ఉంటే ఏముందిలే అనుకుంటూ ఎక్కడివారక్కడే ఉన్నారు. అయితే అమిత్ షా పర్యటన తర్వాత మాత్రం పరిస్థితి మారిపోయింది. పార్టీని పటిష్టపరచాలని, చేరికలను ప్రోత్సహించాలని గట్టిగా చెప్పారాయన. దీంతో రాష్ట్ర నాయకులు చేరికలకోసం ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతున్నారు.

చేరికలకోసం కమిటీ వేస్తున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. అంటే ఈ కమిటీ ఏ పార్టీలో ఎవరెవరు అసంతృప్తితో ఉన్నారు, పార్టీ మారే ఉద్దేశం వారికి ఉందా లేదా అనే విషయాలపై నిఘా పెడతారు. వారందరితో సంప్రదింపులు జరిపి అవకాశం ఉన్నవారికి వెంటనే కండువా కప్పేస్తారు. ఇదీ వారి యాక్షన్ ప్లాన్. మొత్తానికి చేరికలకోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి కలకలం రేపారు సోము వీర్రాజు. మరి ఈ కమిటీ ద్వారా ఏయే పార్టీలనుంచి ఎంతమంది నాయకులు బీజేపీ గూటివైపు వస్తారో వేచి చూడాలి. ఎన్నికల  సమయం దగ్గరపడుతున్నా.. ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయం టీడీపీయేననే విషయం పదే పదే రుజువవుతోంది. ఆ ఇమేజ్ తొలగించాలని, వైసీపీకి బీజేపీ-జనసేన గట్టి ప్రత్యామ్నాయం అని చెప్పాలని ఇరు పార్టీల నేతలు పథకాలు రచిస్తున్నా ఫలితం లేదు. దీంతో ఇదిగో ఇప్పుడిలా పక్క పార్టీల నేతలకు గాలం వేసే పనిలో పడ్డారు కమలనాథులు.

మరింత సమాచారం తెలుసుకోండి: