తమిళనాడులోని నీలగిరి కొండల్లో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇప్పటికే 13 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులు కూడా ఉన్నారు. ఇప్పటికే వీరికి ఢిల్లీలో అంత్యక్రియలు పూర్తి చేశారు కూడా. ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దీంతో మృతులను గుర్తించడం చాలా కష్టంగా మారింది. నిన్నటి వరకు నలుగురిని మాత్రమే గుర్తించిన ఆర్మీ అధికారులు.. తాజాగా చాపర్ ప్రమాదంలో మరణించిన వారిలో మరో ఆరుగురు రక్షణ సిబ్బందిని కూడా అధికారులు గుర్తించారు. దుర్మరణం పాలైన 13 మందిలో నలుగురు ఐఏఎఫ్, ఇద్దరు ఆర్మీ సిబ్బంది మృతదేహాలను వారి బంధువులకు కూడా అప్పగించారు ఆర్మీ అధికారులు. జూనియర్ వారెంట్ ఆఫీసర్లు ప్రదీప్ అరక్కల్, రాణా ప్రతాప్ దాస్, వింగ్ కమాండర్ పృద్వీ సింగ్ చౌహాన్, స్క్వాడ్రన్ లీడర్ కుల్దీప్ సింగ్, లాన్స్ నాయక్ సాయి తేజ, లాన్స్ నాయక్ వివేక్ కుమార్‌ల మృతదేహాలను వారి స్వగ్రామాలకు ప్రత్యేక విమానాల్లో తరిలించారు ఆర్మీ అధికారులు.

ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన వీర సైనికులకు పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఇప్పటికే భారత ఆర్మీ నిర్ణయించింది. లాన్స్ నాయక్ సాయితేజ, లాన్స్ నాయక్ వివేక్ కుమార్ భౌతిక కాయాలను ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు అందజేశారు కూడా. మిగిలిన వారికి ఢిల్లీలోని కంటోన్మెంట్ బేస్ ఆసుపత్రిలో పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించిన తర్వాత వారి వారి స్వస్థలాలకు తరలించారు. సాయితేజ మృతదేహాన్ని ఢిల్లీ నుంచి నేరుగా బెంగళూరు విమానాశ్రయం తరలించారు. అక్కడి నుంచి స్వగ్రామం చిత్తూరు జిల్లా ఎగువరేడ గ్రామానికి ప్రత్యేక వాహనంలో తరలించనున్నారు ఆర్మీ అధికారులు. సాయితేజ మృతదేహం గుర్తించేందుకు ఆర్మీ ఆధికారులు తీవ్రంగా శ్రమించారు. ముందుగా తల్లిదండ్రులు, పిల్లల రక్త నమూనాలను సేకరించారు. అయితే లాన్స్ నాయక్ సాయితేజ చేతిపై ఉన్న పచ్చబొట్టు ద్వారా మృతదేహం గుర్తించారు. ఒక చేతిపై శ్యామ అని, మరో చేతిపై త్రిశూలం పచ్చబొట్లు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. శనివారం సాయంత్రానికి సాయితేజ అంత్యక్రియలు పూర్తి చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: