ప్రస్తుతం దేశంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏవైపు ఉన్నారని చూస్తున్నారంతా. ఆయన సపోర్ట్ చేసిన పార్టీ కచ్చితంగా గెలుస్తుందనే అంచనాలున్నాయి. అంతమాత్రానే పీకే దైవాంశ సంభూతుడేం కాదు. సలహాలివ్వగలడు కానీ.. సొంతగా ఏ పార్టీలోనూ ఎదగలేడనే విషయం ఈపాటికే రుజువైంది. మరి పీకేని మించిన వ్యూహకర్తలు ఎవరూ దేశంలో లేరా.. ? ఉంటే వారు ఎక్కడున్నారు..?

మోదీ విజయాలతోనే ప్రశాంత్ కిషోర్ కూడా బాగా ఫేమస్ అయ్యారు. గుజరాత్ లో మోదీ ప్రభకు ఆయన కూడా ఒక కారణం. ఆ తర్వాత ఎన్డీఏ తొలిసారి అధికారంలోకి వచ్చాక పీకే హవా మరింత పెరిగింది. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల నాయకులు కూడా ఆయన సేవలకు వెలకట్టి తీసుకెళ్లారు. జనతాదళ్ యునైటెడ్ నుంచి బయటికొచ్చిన తర్వాత వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వ్యూహకర్తగా తన సత్తా చూపించారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కోసం పీకే వ్యూహాలు రచించి సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ ని సపోర్ట్ చేస్తారని, ఓ దశలో కాంగ్రెస్ లో చేరతారని అనుకున్నా కూడా అది సాధ్యం కాలేదు. 2024నాటికి పీకే ఏ గట్టున ఉంటారో తేలాల్సి ఉంది.

పీకే వారసులెవరు..?
గతంలో రాజకీయ వ్యూహకర్తలు తెరవెనక ఉండి మంత్రాంగం నడిపేవారు. ఒక్కో నాయకుడికి ఒక్కో వ్యూహకర్త ఉండేవారు. ఏపీలో టీడీపీ అధినేతలకు రామోజీ రావు వంటి రాజకీయ గురువులున్నారు. కానీ పీకే రాకతో వ్యూహకర్త స్థాయి ఏంటో బాగా తెలిసొచ్చింది. మరి ఆయన వారసులుగా ఎదిగేందుకు, పీకేతో పోటీ పడేందుకు ఎవరూ లేరా అంటే ప్రస్తుతానికి అంతా సైలెన్స్. ప్రశాంత్ కిషోర్ కూడా గుజరాత్ ఎన్నికల రిజల్ట్ తర్వాత ఫేమస్ అయ్యారు. అలా ఎక్కడో ఓచోట ఏదో ఒక సంచలన విజయం తర్వాత పీకే వారసులు ఫేమస్ అవుతారు. ఆ తర్వాత వారి చుట్టూ మీడియా, పార్టీలు తిరుగుతాయి.

ప్రస్తుతానికి పీకే, ఆయనన ఐ-ప్యాక్ టీమ్ దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు రాజకీయ సలహాలందిస్తోంది. ఆ తరహాలోనే కొంతమంది కార్పొరేట్ సంస్థల్లాగా మార్కెట్లోకి వచ్చినా పెద్దగా ఫేమస్ కాలేదు. కానీ ఎక్కడో ఓ చోట, ఏదో ఒక సంచలన విజయం నమోదుకాక తప్పదు. దాని వెనక ఉన్న వ్యూహకర్తలెవరనేది ఆ విజయం తర్వాతే తెరపైకి వస్తుంది. అప్పుడే వారి గురించి దేశవ్యాప్తంగా చర్చ మొదలవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: