వంగవీటి రాధా ఇటీవల తన హత్యకు రెక్కీ నిర్వహించారని చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. తన తండ్రి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వంగవీటి రాధా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్లు చేసిన సమయంలో మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా అక్కడే ఉన్నారు. దీంతో వంగవీటి రాధా వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. అసలు వంగవీటి రాధా హత్యకు ఎవరు రెక్కీ నిర్వహించారు.. ఆ విషయం తెలిసి వంగవీటి రాధా ఏం చేశారు.. అనే అంశాలు చర్చనీయాంశం అయ్యాయి.


అయితే ఇప్పుడు వంగవీటి రాధా హత్యకు రెక్కీ నిర్వహించారన్న ఆరోపణల నేపథ్యంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ రెక్కీ నిర్వహించారన్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన మంత్రి కొడాలి నాని.. తనను చంపేందుకు రెక్కీ నిర్వహంచారన్న వంగవీటి రాధ వ్యాఖ్యల్ని సీఎం దృష్టికి తెచ్చారు. ఆ సమయంలోనే జగన్ ఈ ఆదేశాలు ఇచ్చినట్టు మంత్రి కొడాలి నాని తెలిపారు.


కొడాలి నాని ఇంకా ఏం చెప్పారంటే.. “ వంగవీటి రాధా మా తమ్ముడు.. గుడ్లవల్లేరులో నిన్న వంగవీటి రంగా విగ్రహ ఆవిష్కరణ రావాలని పిలిస్తే వెళ్లా.. నా సమక్షంలోనే నిన్న వంగవీటి రాధాపై రెక్కి చేసారు.. రెక్కీపై సీఎంతో నేను చర్చించాను.. రాధాకు 2+2గన్ మెన్లు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు.. రాధాకు వెంటనే భద్రత కల్పించాలని ఇంటలిజెన్స్ డీజీకి సీఎం ఆదేశించారు.. రాధాపై ఎవరు రెక్కీ నిర్వహించారో విచారించి దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశించారు.  రాధాకు ఎవరిపైనన్నా అనుమానాలు ఉంటే  ప్రభుత్వ దృష్టికి తీసుకు రావాలని సీఎం అన్నారు అని కొడాలి నాని తెలిపారు.


రాధా కే కాదు.. ఎవరికి ప్రాణ భయం ఉందని చెప్పినా ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని.. రెక్కీపై సమగ్రంగా దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని  అధికారులకు సీఎం ఆదేశించారని కొడాలి నాని తెలిపారు. రాధాపై ఎవరైనా ఏమైనా చేయాలనుకుంటే ఆలోచనను ఉపసంహరించుకోవాలి లేదంటే ..ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని నాని అన్నారు. రాధాకుఏమీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నాని భరోసా ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: