పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం పేరు చెప్పగానే మొదట అందరికీ గుర్తొచ్చే పేరు చింతమనేని ప్రభాకర్. టీడీపీలో ఫైర్ బ్రాండ్‌గా ఉన్న ఈ నాయకుడుకు దెందులూరుపై ఎంత పట్టు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కువ వివాదాల్లో ఉండే చింతమనేనికి నియోజకవర్గంలో ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. కాకపోతే గత ఎన్నికల్లో వివాదాలు డామినేట్ చేయడం...జగన్ గాలి కలిసిరావడంతో వైసీపీ నుంచి అబ్బయ్య చౌదరీ ఎమ్మెల్యేగా గెలిచేశారు.

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అబ్బయ్య రాజకీయంగా బలపడటంలో విఫలమైనట్లే కనిపిస్తున్నారు. ప్రత్యర్ధిగా బలమైన నాయకుడు ఉన్నప్పుడు ఇంకా బలపడాల్సి ఉంటుంది. పైగా అధికారంలో ఉండటం కూడా కలిసొచ్చే అంశం...అయినా సరే అబ్బయ్య చౌదరీ ఈ రెండున్నర ఏళ్లలో పెద్దగా బలపడలేకపోయారు. పైగా కొంత వ్యతిరేకతని కూడా తెచ్చుకున్నారు.

అదే సమయంలో ప్రజల్లో ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న చింతమనేని అనూహ్యంగా పుంజుకున్నారు. స్థానిక ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ హవా ఉన్నా సరే దెందులూరులో మాత్రం టీడీపీ సత్తా చాటింది. వైసీపీకి గట్టి పోటీ ఇచ్చింది. ఇలా టీడీపీ పోటీ ఇవ్వడానికి కారణం చింతమనేని దూకుడు. ఆయన దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, పైగా అయినా దానికి, కాని దానికి చింతమనేని అరెస్ట్ అవుతూ వచ్చారు. ఆ సానుభూతి కూడా ఎక్కువైంది. దీంతో దెందులూరులో చింతమనేనికి పట్టు దొరికింది.

ఇదే సమయంలో వైసీపీలో కూడా చీలికలు వచ్చేశాయి. అబ్బయ్య చౌదరీ...సొంత పార్టీలోనే నేతలకు సమ ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఒక వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం, మరొక వర్గాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం కూడా మైనస్ అయినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పెదవేగి మండలంలో ఒక వర్గం అబ్బయ్య అంటే రగిలిపోతుంది. వచ్చే ఎన్నికల్లో అబ్బయ్యకు చెక్ పెట్టాలని ఆ వర్గం కాచుకుని కూర్చుంది. వారు పరోక్షంగా చింతమనేనికి సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. మొత్తానికి చూసుకుంటే దెందులూరులో ఈ సారి అబ్బయ్యకు గట్టి దెబ్బే తగిలేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: