కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలకు ప్రభావితం చేయగలవు అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇటీవల జరిగిన కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు అధికార వైసీపీలో అనేక మార్పులు తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకు అధికార పార్టీకి పరిమితమైన అలకలు, అసంతృప్తి సెగలు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీనీ సైతం ఇబ్బంది పెడుతున్నట్లు కనిపిస్తోంది. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార వైసీపీకి ప్రతిపక్ష టిడిపి అసలు పోటీ ఇవ్వగలదా అన్న సందేహాల నడుమ అనూహ్యంగా 15 సీట్లతో ఏకంగా పాలకవర్గ ఏర్పాటుకు సిద్ధం అయ్యింది. అయితే ఎక్సోఫిషియ ఓటుతో అది కాస్తా కోర్టులో నలుగుతుంది. అయితే ఎన్నికల ఫలితం సంపూర్ణం కానప్పటికీ అధికార వైసీపీలో అసంతృప్తి సెగలు ఒకసారిగా బగ్గుమన్నాయి. అయితే అధికార పార్టీ కావడంతో అవన్నీ టీ కప్పు లో తుఫాను లాంటివి అని నేతలు కొట్టి పడేశారు. అలా కాస్త చల్లబడ్డారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా మైలవరం టిడిపిలో మరో కొత్త రాజకీయ కోణం బహిర్గతం అయ్యింది.

కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపునకు ఇద్దరు టిడిపి కీలక నేతలు పనిచేశారని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే కొండపల్లిలో టిడిపి అనూహ్యంగా బలం పుంజుకుందనే ప్రచారం  విస్తృతంగా జరిగింది. అంతే కాకుండా ఎన్నికల అనంతరం టిడిపి కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా బొమ్మసాని సుబ్బారావుకు, కాజా రాజ్ కుమార్ కు అనుకూలంగా పోస్టులు పెడుతూ వచ్చారు. దీంతో కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు కేవలం ఆ ఇద్దరు నేతల కృషి ఫలితం అనే ప్రచారానికి బలం ఏర్పడింది. అందులో భాగంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వారు ఇరువురు శాసనసభ స్థానాలకు పోటీ చేస్తారూ అనే ప్రచారం తెర మీదకు వచ్చింది. అయితే వారు మైలవరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారా లేక ఇతర నియోజక వర్గాలకు వలస వెళతారా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇన్ని సందేహాల నడుమ టిడిపి నాయకులు బొమ్మసాని సుబ్బారావు సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన విడుదల చేశారు. మైలవరం నియోజకవర్గంలో ఉన్న తన అభిమానులు అందరూ సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేస్తూ లిఖిత పూర్వకంగా ప్రకటన చేశారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా లేదా అన్నది పార్టీ ఆదేశాల మేరకు, అలానే అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకు ఉంటుందని చెప్పారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు శిరోధార్యమని... ఆయన నిర్ణయం మేరకు తాను పని చేస్తానని స్పష్టం చేశారు.

ఇక కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో తాను ఆదేశాల మేరకు పని చేశానని కానీ అభ్యర్థుల గెలుపుక మొత్తం అంతా తానే అన్నట్లు ప్రచారం చేయడం తగదని తన అభిమానులకు పరోక్షంగా సంకేతం ఇచ్చారు. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో టిడిపి  గెలుపుకు కేవలం పార్టీ నిలబెట్టిన అభ్యర్దులు, కార్యకర్తలేనని కుండబద్దలు కొట్టారు... ఇప్పటి నుండి ప్రతి ఒక్క టిడిపి కార్యకర్త పార్టీనీ అధికారంలోకి తీసుకురావడం కోసం పని చేయాలని... అలానే నారా చంద్రబాబు నాయడును రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. బొమ్మసాని సుబ్బారావు విడుదల చేసిన ప్రకటనతో మైలవరం టిడిపిలో మరో కొత్త రాజకీయ కోణం ఆవిష్కృతం అయినట్లైంది. ఇప్పటివరకు వైసీపీకి పరిమితమైన అసంతృప్తి సెగలు టిడిపిలో కూడా రగులుకున్నాయా అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. దీంతో వైసీపీ నేతలు సైతం అందుకు అనుగుణంగా తమ భవిష్యత్ కార్యాచరణ పై దృష్టి సారించారు. ఈ మొత్తం రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలు నరాలు తెగే ఉత్కంఠ తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: