తెలంగాణ పోలీసులు ఓ సంచలన విషయం బయటపెట్టారు.. తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ను చంపేందుకు జరిగిన కుట్రను చేధించామని ప్రకటించారు. తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ను చంపేందుకు 15 కోట్ల రూపాయల సుపారీతో ఒప్పందం జరిగినట్టు సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర మీడియాకు తెలిపారు. ఓ సుపారీ గ్యాంగ్‌తో మంత్రి హత్యకు ప్రణాళిక రచించారని..పోలీసులు దాన్ని చేధించారని స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి దారి తీస్తోంది.

పోలీసుల కథనం ప్రకారం అసలు ఏం జరిగిదంటే..  ఫిబ్రవరి  25న ఫరూక్‌, హైదర్‌ అలీ సుచిత్ర వద్ద లాడ్జిలో ఉన్నప్పుడు  నాగరాజు మరికొందరు వారిని వెంబడించారు. దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆ దాడి నుంచి తప్పించుకున్న ఫరూక్, హైదర్‌ అలీ పేట్‌ బషీర్‌బాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లయింట్ ఇచ్చారు. ఫరూక్‌, హైదర్‌ అలీ కంప్లయింట్‌తో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


ఈ విచారణలో దాడికి యత్నించిన వారు మహబూబ్‌నగర్‌కు చెందిన యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్‌ గా తేలింది. ఫిబ్రవరి 26న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని విచారిస్తే మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ ముఠా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ హత్యకు కుట్ర పన్నినట్టు తేలింది. ఈ సుపారీ హత్య విషయం ఫరూక్‌.. హైదర్‌కు చెప్పాడని వీరి మధ్య గొడవ మొదలైందట. దీంతో ఫరూక్‌, హైదర్‌ అలీని ఇద్దరినీ చంపాలని మిగతా ముఠా ప్రయత్నించింది.


విషయం పోలీసులకు తెలిసిందని తేలడంతో ముఠాలోని మిగతా వాళ్లు ఢిల్లీకి పారిపోయారు. నిందితుల కాల్ డేటా ప్రకారం లొకేషన్‌ చెక్‌ చేసి చూస్తే వారంతా ఢిల్లీలో బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి సర్వెంట్‌ క్వార్టర్స్‌లో ఉన్నారని తెలిసింది. ఈ నిందితులకు జితేందర్‌రెడ్డి డ్రైవర్‌, పీఏ అయిన రాజు ఆశ్రయం ఇచ్చినట్టు తేలింది. ఆ తర్వాత పోలీసులు వారిని కూడా అరెస్టు చేశారు. ఆ విచారణలోనే మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను హత్య చేయాలని కుట్ర పన్నినట్టు తేలింది. అయితే ఈ కుట్రలో జితేందర్‌ రెడ్డికి భాగం ఉందా లేదా అన్నది ఇంకా తేలలేదని పోలీసులు అంటున్నారు. ఈ హత్య కుట్ర కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: