ఏపీలో సరైన బ్రాండ్లు దొరక్క, దొరికిన వాటి రేట్లు ఎక్కువగా ఉండటంతో.. ఇతర రాష్ట్రాల మద్యానికి ఇక్కడ బాగా గిరాకీ ఏర్పడింది. అక్కడ తక్కువరేటుకి కొని, ఇక్కడ ఎక్కువరేటుకి అమ్ముతున్నారు. పాండిచ్చేరి, గోవా మద్యం బ్రాండ్లకు ఇటీవల ఏపీలో ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో డిమాండ్ పెరిగింది. ఇటీవల నెల్లూరు జిల్లలో భారీగా గోవా మద్యం చిక్కింది. ఆ తర్వాత పాండిచ్చేరి మద్యం కూడా దొరికింది. దీనిపై మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇందులో వైసీపీ నేతల హస్తం కూడా ఉందని ఆయన ఆరోపించారు.

నెల్లూరులో గోవా మద్యం వ్యాపారం వెనుక వైసీపీ నేతలున్నారని అంటున్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైసీపీ నేతల్లో కొంతమంది మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని పాలన సాగించే పరిస్థితికి వచ్చారని విమర్శించారు. మద్యం పేరుతో ఏపీలో స్లోపాయిజన్ అమ్ముతున్నారని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నారని, ఇదెక్కడి పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఆదాయం కోసం నెల్లూరు ప్రజల ప్రాణాలు పణంగా పెడుతున్నారని అన్నారు సోమిరెడ్డి. ఇప్పటికైనా ఈ దారుణాన్ని ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున గోవా మద్యం చిక్కడంపై సోమిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఆ స్థాయిలో మద్యం నిల్వ చేయాలన్నా, దాన్ని ప్రభుత్వ దుకాణాలకు సరఫరా చేసి అమ్మించాలన్నా అధికార పార్టీ నేతల అండదండలు లేకుండా అలాంటి పనులు జరగవని చెప్పారు. పెద్దల హస్తం లేకుండా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అనుమతి లేని పక్క రాష్ట్రం మద్యాన్ని పబ్లిక్‌ గా విక్రయించడం సాధ్యం కాదన్నారు సోమిరెడ్డి. గోవా నుంచి నాసిరకం మందుని తీసుకొచ్చి నెల్లూరులో అమ్మడం ఇక్కడి నేతలకు కొత్తేం కాదని ధ్వజమెత్తారు. గతంలో కూడా ఇలాంటి పనులు చేశారని, ఇప్పుడు మళ్లీ వీటిని మొదలు పెట్టారని అంటున్నారు. మరోవైపు ఏపీలో లిక్కర్‌ అమ్మకాలు, మరణాలపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇదే విషయాన్ని హైలెట్ చేసి పలుమార్లు సస్పెండ్ అయ్యారు టీడీపీ నేతలు. అసెంబ్లీ బయట కూడా వినూత్న రీతుల్లో ఆందోళన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: