తెలుగు మీడియా దిగ్గజం.. పారిశ్రామిక వేత్త రామోజీరావు ఇంట విషాదం నెలకొంది. ఆయన వియ్యంకుడు ఉప్పలపాటి సుందరనాయుడు అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఉప్పలపాటి సుందరనాయుడు కుమార్తె శైలజ రామోజీరావు పెద్ద కోడలు. ఈనాడు ఎండీ కిరణ్‌ భార్య. ఇటీవలే కిరణ్‌, శైలజల కుమార్తె బృహతి వివాహం రామోజీ ఫిలింసిటీలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇంతలోనూ ఆ కుటుంబంలో ఈ విషాదం చోటు చేసుకుంది.


ఉప్పలపాటి సుందర నాయుడు..  పౌల్ట్రీ రంగంలో ప్రముఖ వ్యక్తుల్లో ఒకరుగా పేరు గాంచారు. కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి సుందర నాయుడు విశేషంగా కృషి చేశారు. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి వేసి కోళ్ల రైతుల కోసం కృషి చేశారు. బాలాజీ హేచరీస్‌ స్థాపించి ఎందరో అన్నదాతలకు అండగా నిలిచారు. సుందర నాయుడు మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.


ఉప్పలపాటి సుందర నాయుడు స్వస్థలం చిత్తూరు జిల్లా. హైదరాబాద్‌లోని ఏఐజీలో హృద్రోగ సమస్యకు చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. ఈనెల 6న ఆయనకు గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న సాయంత్రం మరణించారు. ఇవాళ సుందర నాయుడు పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి చిత్తూరుకు తరలించి.. ఆయన సొంత గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.


సుందర నాయుడు వెటర్నరీ డాక్టర్‌గా కేరీర్‌ ప్రారంభించి ఏపీ పౌల్ట్రీ సమాఖ్య అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించే స్థాయికి ఎదిగారు. చిత్తూరులో బాలాజీ హేచరీస్‌ స్థాపించి దాన్ని తెలుగు రాష్ట్రాల్లో విస్తరింపజేశారు. సుందర నాయుడుకు ఇద్దరు కుమార్తెలు. వారిలో ఒకరైన శైలజ కిరణ్‌.. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు పెద్ద కోడలు. ప్రస్తుతం ఆమె మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు మేనేజింగ్‌ డైరెక్టరుగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: