నెల్లూరు జిల్లాలో ఓ స్కూల్ పేరు గురించి ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఆ స్కూల్ అభివృద్ధికి విరాళం ఇచ్చిన దాతల్ని ప్రభుత్వం విస్మరించడం తగదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హై స్కూల్ గా ప్రమోట్ అయిన తర్వాత ఇటీవలే ఈ స్కూల్ ని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ప్రారంభించారు. అయితే స్కూల్ కి దాతల పేరు పెట్టే విషయంలో అధికారులు అలసత్వంతో ఉన్నారని, దాని వల్ల ఆ ప్రక్రియ ఆలస్యం అవుతోందనేది పిటిషనర్ కిరణ్ కుమార్ రెడ్డి వాదన. వివిధ కారణాలతో దాతల అభ్యర్థనలను తిరస్కరించడం సరికాదని కోర్టు అధికారులకు హితవు పలికింది.

రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములయ్యే దాతలు.. అధికారుల వ్యవహార శైలి ఇలాగే కొనసాగితే విరాళాలివ్వడానికి, అభివృద్ధిలో భాగస్వాములవడానికి ముందుకు రారని అన్నది హైకోర్టు. ప్రభుత్వ తీరుతో చివరిగా రాష్ట్ర ప్రజలే నష్టపోతారని చెప్పింది. రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకునేవారికి  ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని అడిగింది కోర్టు.

నెల్లూరు జిల్లాలో హైస్కూల్ పేరు మార్పు వ్యవహారంపై మరింత స్పష్టతకోసం మే 5న న్యాయస్థానం ముందు హాజరుకావాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్ కుమార్ ను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఈ కేసులో ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేటలో ఈ హైస్కూల్ ఉంది. గతంలో ఇది ఎలిమెంటరీ స్కూల్ గా ఉండేది. అప్పటినుంచి ఆ స్కూల్ కోసం మాజీ సర్పంచ్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి దాదాపు 41 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. స్కూల్ ని దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. ఆయన చొరవతోనే అదిప్పుడు హైస్కూల్ గా ప్రమోట్ అయింది. పిల్లల సంఖ్య పెరిగింది. ఇటీవలే ఈ స్కూల్ అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కాకాణి చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే ఈ స్కూల్ కి తన తండ్రి నారపరెడ్డి సీతారామిరెడ్డి పేరు పెట్టాలంటూ 2021 సెప్టెంబర్ లో కిరణ్ కుమార్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు. పాఠశాల కమిషనర్ కి ప్రతిపాదనలు అందించినా వారు తిరస్కరించారని చెప్పారు. జీవోలో మార్పు వచ్చిందని చెప్పారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థన ఇచ్చే నాటికి కొత్త జీవో రాలేదు. కేవలం అధికారుల అలసత్వం వల్లే ఈ పేరుమార్పు వ్యవహారం ఇంతదూరం వచ్చిందని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: