గతంలో ఓ పార్టీ నాయకుడు చేసిన విమర్శకు మరో పార్టీలోని నాయకుడు సమాధానం చెప్పేవాడు, వివరణ ఇచ్చేవాడు, ఇంకా ముందుకెళ్తే, వారిపై మరో ప్రత్యారోపణ చేసేవాడు. కానీ ఇప్పుడా మాటల యుద్ధం పత్రికల వరకు వెళ్లింది. ఒకరు టీడీపీకి అనుకూలం, మరొకరు వైసీపికి అనుకూలం అని సరిపెట్టుకున్నా కూడా ఇలా నేరుగా ఎప్పుడూ బయటపడలేదు. ఇప్పుడు తొలిసారిగా ఒక పత్రికలో వచ్చిన కథనాలకు మరో పత్రిక కౌంటర్ ఇవ్వడం మొదలు పెట్టింది. ఈ పరిస్థితి ఎక్కడి వరకు వెళ్తుందో ఏమో..!

ఇటీవల గుంటూరు సంట్రల్ డ్రగ్ స్టోర్స్ లో కోట్ల రూపాయల మందులు వృథాగా పడి ఉన్నాయని, ఎక్స్ పయిరీ డేట్ కి సమయం దగ్గరపడినా వాటిని ఉపయోగించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఈనాడు ఓ కథనం రాసింది. దానికి కౌంటర్ గా ఇప్పుడు సాక్షి రంగంలోకి దిగింది. గత టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తుత వైసీపీ వైఫల్యాలుగా చూపించేందుకు ఈనాడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందనేది సాక్షి కథనం సారాంశం. ఈనాడులో వచ్చినట్టు మందులు వృథా అయిన మాట వాస్తవమే కానీ, దానికి కారణం మాత్రం గత ప్రభుత్వం అంటోంది సాక్షి. 2019, 2020 సంవత్సరాల్లో కొనుగోలు చేసిన మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, సిరంజులు, నీడిల్స్, సెలైన్‌ బాటిల్స్.. అన్నీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేశారని చెప్పింది సాక్షి దినపత్రిక. 2019కు ముందు వివిధ రకాల పథకాలు, పుష్కరాల కోసం కొనుగోలు చేసిన మందుల నిల్వలను అప్పటి ప్రభుత్వం సక్రమంగా వినియోగించలేదని విమర్శించింది.

2016 నుంచి 2019 మధ్య కాలంలో అప్పటి వైద్య శాఖ అధికారులు, అప్పటికి అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా.. రూ.31,14,06,713.04 విలువైన మందులు వృథాగా మారాయని సాక్షి ఆరోపిస్తూ కథనాన్ని వెలువరించింది. ఇక కరోనా మందుల విషయానికొస్తే.. కరోనా చికిత్సకు ఉపయోగించే కొన్ని రకాల మందులను కేంద్ర ప్రభుత్వం, ప్రైవేట్‌ ఏజెన్సీలు రాష్ట్రానికి సప్లై చేశాయని, అయితే వాటిల్లో కొన్నిటిని ఆస్పత్రుల్లో వినియోగించలేదని, దీంతో అవి ఎక్స్ పయిర్ అయ్యాయని వివరణ ఇచ్చింది. అన్ని జిల్లాల్లో కమిటీలు వేసి, అక్కడినుంచి వచ్చిన రిపోర్ట్ ల ఆధారంగా.. ఎక్స్ పయిరీ డేట్ అయిపోయిన మందుల్ని డిస్పోజ్ చేస్తున్నట్టు తెలిపింది. అయితే ఈలోగా ఈనాడులో తప్పుడు కథనాలు వచ్చాయంటోంది సాక్షి. గతంలో నాయకుల మధ్య జరిగే మాటల యుద్ధం.. ఇప్పుడు నేరుగా పత్రికల మధ్యకు వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: