బుధవారం జరిగిన ఒక వర్క్ షాపులో జగన్మోహన్ రెడ్డి ఏడుగురు ఎంఎల్ఏలకు పెద్ద షాకేఇచ్చారు. గడపగడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం జరుగుతున్న విధానంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు, ఎంఎల్ఏలు, జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు కూడా హాజరయ్యారు.  ఈ సమావేశంలో కార్యక్రమం జరుగుతున్న విధానంపై జగన్ సంతృప్తి వ్యక్తంచేశారు. గడపగడపకు వైసీపీ ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.






ఈ కార్యక్రమం విజయవంతానికి వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుకు జగన్ గత సమావేశంలోనే ముడిపెట్టిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో మంత్రులు, ఎంఎల్ఏలు పాల్గొనే విషయమై తాను రిపోర్టు తెప్పించుకుంటానని కూడా అప్పట్లోనే చెప్పారు. అయినా దాదాపు నెలరోజులుగా జరుగుతున్న కార్యక్రమంలో ఏడుగురు ఎంఎల్ఏలు అసలు పాల్గొననేలేదు. కొందరు ఎంఎల్ఏలైతే తమకు బదులుగా తమ ప్రతినిధులను పంపుతున్నారట.






మంత్రుల్లో కూడా కొందరు కార్యక్రమంలో సరిగా ఇన్వాల్వ్ కాలేదని జగన్ తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తంచేశారు. పార్టీవర్గాల సమాచారం ప్రకారం గిద్దలూరు, ఏలూరు, కోవూరు, శ్రీశైలం, మైలవరం నియోజకవర్గాల ఎంఎల్ఏలు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని జగన్ మండిపడ్డారట. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని, అందరు పాల్గొనాలని జగన్ హెచ్చరించిన తర్వాత కూడా ఏడుగురు ఎంఎల్ఏలు గడపగడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనలేదంటే ఆశ్చర్యంగానే ఉంది. మరి మిగిలిన ఇద్దరు ఎంఎల్ఏలు ఎవరో తెలీటంలేదు.






చూడబోతే వీళ్ళల్లో కొందరికి టికెట్లు ఇవ్వటంలో జగన్ కచ్చితంగా కత్తెర వేయటం ఖాయమనే ప్రచారం మొదలైపోయింది. తాను ఇంత స్పష్టంగా చెప్పినా, హెచ్చరించినా ఎంఎల్ఏలు తనను లెక్కచేయలేదనే కోపం జగన్లో బాగా పెరిగిపోతోందట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కార్యక్రమంలో పాల్గొనని ఎంఎల్ఏల్లో ఐదుగురు జగన్ తో మంచి సంబంధాలున్న వాళ్ళే. జగన్తో ఇంతటి మంచి సంబంధాలున్న వాళ్ళు కూడా ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో పాల్గొనలేదంటే ఆశ్చర్యంగానే ఉంది. మరి వీళ్ళెందుకు కార్యక్రమంలో పాల్గొనలేదో, జగన్ కు ఏమని వివరణ ఇచ్చుకుంటారో ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: