పవన్ కల్యాణ్ గతంలో టెన్త్ క్లాస్ ఫెయిలయ్యారని, అందుకే ఆయనకు టెన్త్ ఫెయిలైన విద్యార్థులంటే అభిమానం ఉందని, అందుకే గ్రేస్ మార్కుల ప్రతిపాదన తెచ్చారని సెటైర్లు వేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ఫెయిలైన విద్యార్థులకు 10 గ్రేస్ మార్కులు కలిపి వారిని పాస్ చేయించాలంటూ పవన్ చేసిన ప్రతిపాదనపై ఆయన స్పందించారు. అసలు గ్రేస్ మార్కులు ఎందుకు కలపాలన్నారు. చదువుకుంటేనే ఎవరైనా పాస్ అవుతారనే విషయాన్ని పవన్ కల్యాణ్ గ్రహించాలని హితవు పలికారు పేర్ని నాని. టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విషయంలో పవన్ ఇలా ఎలా స్పందించారని ఆయన ప్రశ్నించారు.

గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా టెన్త్ పరీక్షలు నిర్వహించలేదు. ఈ ఏడాది పరీక్షలు పెట్టడం వల్ల రిజల్ట్ తక్కువగా వచ్చాయి. గతంలో ఎప్పుడూ లేనంత ఘోరంగా రిజల్ట్ వచ్చాయనే విషయం తెలిసిందే. అయితే ఈ ఫలితాలకు కారణం ప్రభుత్వమేనంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ వైఖరి వల్లే పదో తరగతి విద్యార్థులు ఫెయిలయ్యారనే విమర్శలు మొదలయ్యాయి. ఉపాద్యాయులకు నాన్ టీచింగ్ విధులు కేటాయించడం వల్లే వారు సరిగా పాఠాలు చెప్పలేకపోయారని, అందుకే విద్యార్థులు ఫెయిలయ్యారని అంటున్నారు ప్రతిపక్ష నేతలు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఓ వినూత్న ప్రతిపాదన చేశారు. పది ఫెయిలైన విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపాలన్నారు. అదే సమయంలో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షకోసం ఫీజు వసూలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రభుత్వం నుంచి కౌంటర్లు మొదలయ్యాయి.

పవన్ కల్యాణ్ టెన్త్ ఫెయిలయ్యారని, అందుకే ఆయన టెన్త్ ఫెయిలైన విద్యార్థులను స్వజాతి పక్షులుగా గుర్తించి ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి పేర్ని నాని. పదో తరగతి పరీక్ష పేపర్లు తయారు చేసింది, దిద్దింది వైసీపీ నేతలు కాదనే విషయాన్ని పవన్ కల్యాణ్ గుర్తించాలన్నారు పేర్ని నాని. కష్టపడి చదివితే ఎవరైనా పరీక్షలు పాసవుతారని, గ్రేస్ మార్కుల వల్ల కాదని పవన్ కి హితవు చెప్పారు. పవన్ పదో తరగతి ఫెయిల్ అనే విషయం ఇప్పుడు కలకలం రేపుతోంది. పవన్ కల్యాణ్ పై ఇప్పటికే వైసీపీ నుంచి విమర్శల దాడి పెరిగింది, తాజాగా పదో తరగతి ఫెయిల్ అంటూ నాని చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: