ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు హుందాతనం కోల్పోయారా ? ఆయన మాటలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. గన్నవరంలో పార్టీ ఆఫీసును చూడటానికి వెళ్ళిన చంద్రబాబు ముఖ్యమంత్రితో పాటు మరికొందరిని నోటికొచ్చినట్లు మాట్లాడారు. కొట్టేసుకుందాం రమ్మన్నారు. లగ్నం పెట్టుకుని కొట్టుకోవటానికి తాను రెడీగా ఉన్నట్లు చెప్పారు. ధైర్యముంటే పోలీసు సెక్యూరిటి లేకుండా రావాలని చాలెంజ్ చేశారు. కొట్టుకునేందుకు వైసీపీ నేతలు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.





చంద్రబాబు మాటలు, చేష్టలు చూస్తుంటే ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరుకున్నట్లు అర్ధమవుతోంది. అందుకనే హుందాతనం కోల్పోయి ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఒకపుడు చంద్రబాబు ఇంత చీపుగా మాట్లాడేవారు కాదు. తమ్ముళ్ళల్లో ఎవరైనా మాట్లాడితే పట్టించుకునే వారు కాదు కానీ తాను మాత్రం హుందాగానే మాట్లాడేవారు.  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇలా మాట్లాడటం ఎక్కువైపోతోంది. బహుశా తాను మాస్ లీడర్ అనిపించుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారో ఏమో అర్ధం కావటంలేదు.





నోటికొచ్చింది తిడితే, మాట్లాడితే మాస్ లీడర్ అయిపోయినట్లే అని చంద్రబాబుకు ఎవరైనా చెప్పారేమో తెలీటంలేదు. లేకపోతే కొట్టేసుకోవటం ఏమిటి, పోలీసులు లేకుండా రావాలని చాలెంజ్ చేయటం ఏమిటి ? లగ్నం పెట్టుకుని కొట్టుకోవటానికి రెడీగా ఉంటానని చెప్పటం ఏమిటో అర్ధంకావటంలేదు. తనలో ఎంతటి అసహనం పేరుకుపోతున్నా ఒకపుడు బయటకు కనబడకుండా జాగ్రత్తపడేవారు. అలాంటిది తరచూ ఆయనే నియంత్రణ కోల్పోతున్నారు.





గన్నవరంలో చంద్రబాబు ఇలా మాట్లాడారో లేదో వెంటనే మాజీమంత్రి కొడాలి నాని అందుకున్నారు. నిజానికి మాటల్లో కానీ బూతుల్లో కానీ కొడాలిని చంద్రబాబు ఎప్పటికీ బీట్ చేయలేరు. అందుకనే చంద్రబాబును పట్టుకుని కొడాలి దుమ్ము దులిపేశారు. స్వయంగా చంద్రబాబే నియంత్రణ కోల్పోయి నోటికొచ్చింది మాట్లాడేస్తుంటే ఇక తమ్ముళ్ళని ఎవరు కంట్రోల్ చేయాలి ? ఇలా మాట్లాడితేనే జనాలు ఓట్లేస్తారని, అధికారంలోకి తీసుకొస్తారని చంద్రబాబు అనుకుంటున్నారేమో. మొత్తానికి చింతకాయల అయ్యన్నపాత్రుడు, బుద్ధా వెంకన్న, బోండా ఉమా లాంటి వాళ్ళ సరసన చంద్రబాబు కూడా చేరిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: