ఏపీలో ఎలక్ట్రిక్ బస్సుల రాకకు రంగం సిద్ధమైంది. వీటితో కాలుష్యానికి అడ్డుకట్టపడనుంది. ఎలక్ట్రిక్ బస్సులతో సౌకర్యాలు ఉన్నా.. ఇవి చాలా ఖరీదు. అందుకే ఆర్టీసీ ఇప్పుడు అద్దె బస్సులను సమకూర్చుకుంటోంది. సంస్థపై భారం పడకుండా.. కాలుష్యాన్ని తగ్గించుకుంటూ..లాభాలబాట పట్టేందుకు ప్రయత్నిస్తోంది. అద్దె ప్రాతిపదికన ఈ సంవత్సరం వెయ్యి విద్యుత్తు బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది.


ఈ బస్సులకు కిలోమీటర్ల ప్రాతిపదికన చెల్లింపులు జరుపుతారు. తొలిదశలో 350 విద్యుత్తు బస్సులు ప్రవేశపెట్టేందుకు తాజాగా ఆ సంస్థ టెండర్లు ఆహ్వానించింది. మలిదశలో మరో 650 బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్న ఈ సర్వీసులను మొదట తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ మార్గాల్లో ప్రారంభిస్తారట. 12 ఏళ్ల కాలపరిమితితో ఈ బస్సుల నిర్వహణ కోసం టెండర్లు పిలిచింది.


ఈ టెండర్లలో పూర్తిగా దేశీయ బస్సు తయారీ సంస్థలకే అవకాశం ఇచ్చారు.అక్టోబర్ 14లోగా టెక్నికల్ బిడ్లు, నవంబర్ 1న ఫైనాన్షియల్ బిడ్లు దాఖలు చేస్తారు. ఎలక్ట్రిక్‌ బస్సులపై నవంబర్ ఆరో తేదీన రివర్స్ బిడ్డింగ్‌కు వెళ్లనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ టెండర్ల ప్రీబిడ్‌ సమావేశంలో తొమ్మిది కంపెనీల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం స్వదేశీ విద్యుత్తు బస్సుల తయారీని ప్రోత్సహిస్తోంది. వాటిని ఎక్కువ సంఖ్యలో ప్రజారవాణాకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. బస్సు పరిమాణం పరిగణనలోకి తీసుకుని విద్యుత్తు బస్సులను నడిపేందుకు ఆసక్తి చూపించే రాష్ట్రాలకు సబ్సిడీలను అందిస్తోంది.


వెట్‌లీజ్‌ ప్రాతిపదికగా ఈ బస్సును తీసుకొస్తున్నారు. వెట్ లీజ్ అంటే.. ఈ బస్సుల నిర్వహణ మొత్తం ప్రైవేటు వారిదే.. టెండరు దక్కించుకున్నవారే బస్సు నిర్వహణ, డ్రైవర్ ను చూసుకోవాలి. ప్రస్తుతం ఆర్టీసీలో అద్దె బస్సులు నడుస్తూనే ఉన్నాయి. ఆ తరహాలోనే ఈ ఎలక్ట్రిక్ అద్దె బస్సులు నడుస్తాయన్నమాట. వీరికి కిలోమీటర్ల ప్రాతిపదికన చెల్లింపులు జరుపుతారు. ప్రతిరోజు 250 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటరు మార్గాన్ని ఈ బస్సులకు ఇస్తారు. ఈ బస్సుల్లో కేవలం కండక్టర్ మాత్రమే ఆర్టీసీ నుంచి ఉంటాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: