హైకోర్టు సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది. గాంధీ ఆస్పత్రికి నిందితుల మృతదేహాలను తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మృతదేహాలను మహబూబ్ నగర్ ఆస్పత్రి నుండి పోలీస్ బందోబస్త్ మధ్య సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుల కుటుంబ సభ్యులు నిందితుల మృతదేహాలను ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. 
 
మృతదేహాలను తమకు అప్పజెప్పాలని వారి ముఖాలనైనా చూసుకుంటామని కనికరం చూపించాలని వేడుకుంటున్నారు. చెన్నకేశవులు భార్య వాయిదా వేస్తే ఎదురు చూసే ఓపిక నశించిందని చెబుతున్నారు. ఇన్ని రోజులు మృతదేహాలను తమ దగ్గరే ఉంచుకున్నా కోపం తీరలేదా అని చెన్నకేశవులు భార్య ప్రశ్నించింది. మా పై ఎందుకు కక్ష కడుతున్నారంటూ చెన్నకేశవులు భార్య ఆవేదన వ్యక్తం చేసింది. 
 
చెన్నకేశవులు తండ్రి కురుమయ్య మాట్లాడుతూ ఎన్ కౌంటర్ చేశారని ఇప్పుడు మృతదేహాలను అప్పగిస్తే చివరిచూపైనా చూస్తామని చెబుతున్నారు. శివ తండ్రి రామయ్య మాట్లాడుతూ కనీసం అంత్యక్రియలు చేసుకోవడానికైనా మృతదేహాలను అప్పగించాలంటూ వేడుకుంటున్నారు. హైకోర్టు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను ఇప్పటికే పరిశీలించింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ ఎన్ కౌంటర్ పై ప్రభుత్వం ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసిందని కోర్టుకు తెలిపారు. 
 
షాద్ నగర్ సమీపంలో క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేసే సమయంలో నిందితులు పోలీసుల దగ్గర నుండి తుపాకులు లాక్కోవటంతో పాటు రాళ్లు రువ్వటంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. నలుగురు నిందితులు అక్కడికక్కడే మృతి చెందారు. నవంబర్ 27వ తేదీన దిశపై నిందితులు అత్యాచారం చేసి చటాన్ పల్లి బ్రిడ్జి దగ్గర కాల్చివేశారు. నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయటంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం కావటం గమనార్హం. దిశ ఘటన తరువాత ప్రభుత్వాలు కూడా అత్యాచారాలు, హత్య కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు విధించేలా చట్టాల్లో మార్పులు చేస్తూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: