ఢిల్లీలో సీఏఏకు నిరసనగా చేపట్టిన ఆందోళనా కార్యక్రమాలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయడంతో నిన్న అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. అయితే  రెండు రోజున కూడా ఈ అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతుండగా... తాజాగా ఆ నిరసనలు హింసకు దారి తీశాయి. ఢిల్లీలోని భజన్‌పురా, మౌజ్‌పూర్ మరియు జాఫ్రాబాద్‌‌లలో మరోసారి హింసాత్మక వాతావరణం చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరిపై ఒకరు రాళ్ల దాడికి దిగారు. అంతేకాదు వాహనాలకు, దుకాణాలకు నిప్పు పెట్టారు.

 

దీంతో దేశరాజధాని ఒక్కసారిగా యుద్ధ వాతావరణాన్ని తలపించింది. హింసాత్మక ఘటనతో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘటనలో ఓ హెడ్ కానిస్టేబుల్ సహా ఇప్పటివరకు ఆరుగురు మృతిచెంద‌గా..  150 మందికి పైగా గాయపడ్డారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే నిరసనకారులు రాళ్లు రువ్వడం మొదలుపెట్టారు. మరోవైపు ఢిల్లీలో శాంతి భద్రతలపై అర్థరాత్రి వరకు హోంమంత్రి అమిత్ ఫా సమీక్ష నిర్వహించారు. అమిత్ షా సమీక్షలో ఇంటెలిజెన్స్ చీఫ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కాగా, ఈశాన్య ఢిల్లీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థతుల కారణంగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. 

 

ఈ ఘటనపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, ఇంటెలిజెన్స్ చీఫ్, ఈశాన్య ఢిల్లీ ప్రాంత అధికారులు, ఎమ్మెల్యేలతో అమిత్ షా అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.  ముఖ్యంగా అల్లర్లు జరిగిన ప్రాంతాల ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారు. ఓ వైపు యుఎస్ అధ్యక్షుడు  ట్రంప్ భారత పర్యటనకు వఛ్చిన సందర్భంలో దేశ రాజధానిలో ఇలా ఘర్షణలు, అల్లర్లు జరగడం కేంద్రాన్ని, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఇరకాటాన పెడుతోంది. ఈ క్ర‌మంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

  
 

మరింత సమాచారం తెలుసుకోండి: