ప్రపంచం మొత్తాన్ని కొరోనా వైరస్ వణికించేస్తోంది. మిగితా దేశాల సంగతి ఎలాగున్నా అగ్రరాజ్యం అమెరికా మాత్రం చిగురుటాకులాగ అల్లాడిపోతోంది. ఇప్పటికే ఇటలీ, స్పెయిన్, ఇరాన్, ఫ్రాన్స్ పరిస్దతి ఘోరంగా మారిపోయింది. ఈ పరిస్దితుల్లో ఇటలీ, స్పెయిన్ తో అమెరికా పోటి పడుతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే అమెరికాలో వైరస్ బాధితుల సంఖ్య లక్షదాటి పోతే మరణాలు కూడా దాదాపు 1300కు చేరుకున్నాయి.

 

ప్రపంచం మొత్తం మీద టెక్నాలజితో పాటు ఇతర వనరుల్లో అమెరికా టాప్ పొజిషన్లో ఉంది కాబట్టే ఆ దేశం అగ్రరాజ్యమైంది. అటువంటి దేశమే వైరస్ దెబ్బకు వణికిపోతుంటే అదే పరిస్ధితి మనదేశంలో కూడా ఎదురైతే ? అసలు ఊహించుకోవటానికే భయకరంగా ఉంటుంది పరిస్దితి. ఎందుకంటే మెడికల్, టెక్నాలజీ రంగాల్లో అత్యంత ఆధునిక సదుపాయాలున్న అమెరికానే వైరస్ ను కంట్రోల్ చేయలేకపోతోంది.  ప్రతిరోజు వేలాది మంది వైరస్ భారిన పడుతున్నారు. వాళ్ళల్లో చాలామందిని ఆసుపత్రులు చేర్చుకోవటం లేదు.

 

కొలంబియా యూనివర్సిటి ఆసుపత్రిలోని 4500 మంది సిబ్బందిలో 1200 మందికి వైరస్ ఎటాక్ అయ్యింది. న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో పరిస్ధితి చాలా భయంకరంగా ఉంది. చాలా ఆసుపత్రులు వైరస్ సోకిన వారికి చికిత్స చేసి మందులు రాసిచ్చేసి బయట నుండే పంపేస్తున్నారు. హోటళ్ళు, ఫుట్ బాల్ గ్రౌండ్లు, కాలేజీలు, స్కూళ్ళు కూడా క్వారంటైన్ సెంటర్లుగా మారిపోతున్నాయి.  ఒకరకంగా వైరస్ ను అదుపు చేయలేక అమెరికా  చేతులెత్తేసినట్లే అనుకోవాలి.

 

ఇక మనదేశం గురించి చెప్పుకునేదేముంది. మన దేశంలో వైద్య వ్యవస్ధ కూడా అంతంత మాత్రమే. ఏదో కొద్ది మందికి మాత్రమే వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న దేశం మనది. రవాణా సౌకర్యాలు లేవు. ఆర్ధిక పరిస్ధితి కూడా అంతంత మాత్రమే. ఇటువంటి నేపధ్యంలో కొరోనా వైరస్ అమెరికాలో విజృంభిస్తున్నట్లు ఇక్కడ కూడా విజృంభిస్తే చెప్పాల్సిన పనేలేదు. మొత్తం దేశమే కుప్ప కూలిపోవటం ఖాయం.

 

అందుకనే అమెరికా పరిస్ధితి మనకు ఎదురు కాకూడదనే మన ప్రభుత్వాలు లాక్ డౌన్ పేరుతో కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అందుబాటులో ఉన్న సౌకర్యాలతోనే ఐసొలేషన్ వార్డులు, క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. మన దగ్గర కూడా అమెరికా పరిస్ధితి రాకూడదంటే మనమందరం సెల్ఫ్ క్వారంటైన్ మెయిన్ టైన్ చేయాల్సిందే వేరే దారిలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: