ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి దేశంలో ఏపీలో మాత్రమే కరోనా టెస్టింగ్‌ కిట్లు, వెంటిలేటర్లు తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ చివరి వారం లోపు రోజుకు 4,000 మందికి పరీక్షలు జరిపే విధంగా కిట్లను తయారు చేస్తున్నామని ప్రకటన చేశారు. ఈరోజు సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి సీఎం జగన్ కరోనా టెస్టింగ్ కిట్లను ప్రారంభించారని చెప్పారు. 
 
ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా టెస్టింగ్ కిట్లు ఎగుమతి అవుతాయని అన్నారు. టీబీ మెషిన్లకు అమర్చుకునే విధంగా టెస్టింగ్ కిట్లను తయారు చేశామని... వైజాగ్ లో వెంటిలేటర్ల తయారీని కూడా ప్రారంభించనున్నామని తెలిపారు. దేశంలో వైజాగ్ లో తొలిసారిగా ఇండియన్‌ మేడ్‌ వెంటిలేటర్లు తయారు కాబోతున్నాయని మంత్రి అన్నారు. జగన్ ముందుచూపు వల్లే రాష్ట్రంలో కిట్లు తయారవుతున్నాయని పేర్కొన్నారు. 
 
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మెడ్ టెక్ జోన్ విషయంలో నిర్లక్ష్యం వహించిందని.... జగన్ మెడ్ టెక్ జోన్ కు నిధులు ఇచ్చి అందుబాటులోకి తెచ్చారని పేర్కొన్నారు. జగన్ మాటల మనిషి కాదని చేతల మనిషి అని మంత్రి ప్రశంసించారు. పరిశ్రమల్లో పని చేసే కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టామని తెలిపారు. 
 
రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ టెస్టింగ్ కిట్లు పని చేసే తీరు గురించి మంత్రికి వివరించారు. ప్రభుత్వం ప్రస్తుతం 1000 టెస్టింగ్ కిట్లను రాష్ట్రంలో అందుబాటులోకి తెచ్చింది. ఒక్క కిట్ సహాయంతో 20 నిమిషాల్లో పరీక్షలు చేసే అవకాశం ఉండటంతో పాటు... కేవలం 55 నిమిషాల్లో కరోనా సోకిందో లేదో సులభంగా నిర్ధారణ అవుతుంది. రాబోయే ఏడు రోజుల్లో 10,000 టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి రానున్నాయని సమాచారం.       

మరింత సమాచారం తెలుసుకోండి: