కేంద్రం నాలుగో విడత మార్గదర్శకాల్లో అంతర్రాష్ట్ర సర్వీసులకు అనుమతులు ఇవ్వడంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆరెంజ్, గ్రీన్ జోన్లలో బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా కర్ణాటక సీఎం యడ్యూరప్ప బస్సులు రోడ్డెక్కటానికి అనుమతులు ఇచ్చారు. 
 
అయితే మే 31వ తేదీ వరకు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి వచ్ఛే అంతర్జాతీయ, రాష్ట్రీయ ప్రయాణికులను కర్ణాటక నిషేధం విధించింది. రాష్ట్రాల పరస్పర అంగీకారంతోనే ప్రయాణికుల తరలింపు జరగాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతూ ఉండటంతో ఆయా రాష్ట్రాల ప్రయాణికులను అనుమతించకూడదని కర్ణాటక సీఎం నిర్ణయం తీసుకున్నారు. 
 
కర్ణాటక సర్కార్ రాష్ట్రంలో పలు ఆంక్షలను సడలించింది. రాష్ట్రంలో ప్రభుత్వం భౌతిక దూరం పాటింపు నిబంధనలతో అన్ని రైళ్లను, బస్సులను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో 30 మంది ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఊబర్, ఓలా ట్యాక్సీ సర్వీసులకు అనుమతిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది. 
 
ఆదివారాల్లో మాత్రం అత్యవసర సర్వీసులు మినహా అన్నింటిపైనా లాక్ డౌన్ ఆంక్షలను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దక్షిణ భారతదేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక రాష్ట్రంలో తక్కువ కేసులు నమోదయ్యాయి. కేంద్రం లాక్ డౌన్ నిబంధనలు సడలించటంతో నిబంధనల సడలింపు దిశగా కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్ణాటక రాష్ట్రం నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు బస్సులు తిరిగే అవకాశం ఉందని తెలుస్తోంది, అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.      

మరింత సమాచారం తెలుసుకోండి: