ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డు అనుమతి లేకుండా పోతిరెడ్డిపాడు ప్రాజక్టు సామర్థ్యం పెంచుకునేందుకు జీవో విడుదల చేయడంపై తెలంగాణ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కృష్ణాబోర్డు కూడా ఏపీ ప్రభుత్వాన్ని వివరణ అడిగింది. ఈ ఇష్యూతో నిన్న మొన్నటి వరకూ స్నేహితుల్లా ఉన్న జగన్, కేసీఆర్ ఒక్కసారిగా ప్రత్యర్థులుగా మారినట్టు కనిపిస్తోంది. ఏపీ సర్కారు తెచ్చిన జీవోపై తెలంగాణ పోరాటం సాగిస్తామని ప్రకటించింది.

 

 

తెలంగాణ సర్కారు ఫిర్యాదు మేరకే.. కృష్ణా రివర్‌ బోర్డ్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌తో ఆంధ్రప్రదేశ్‌ అధికారులు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీ నీటిపారుదల శౄఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌దాస్‌, అధికారులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై వివరణ ఇచ్చారు. అయితే అదే సమయంలో ... ఏపీ అధికారులు కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపైనా ఫిర్యాదు చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండానే ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు చేపట్టిందని చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లారు.

 

 

అంతే కాదు.. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఎదురవుతుందన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర జలవనరుల శాఖతో పాటు పలు వేదికలపై అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు గుర్తు చేశారు. గోదావరి నదిపై ఎస్‌ఆర్‌ఎస్పీ నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు ఎలాంటి నీటి కేటాయింపులు జరగకపోయినా ఈ ప్రాజెక్టులను తెలంగాణ కొనసాగిస్తుందని కృష్ణా, గోదావరి రివర్‌ బోర్డు చైర్మన్లకు ఏపీ అధికారులు ఫిర్యాదు చేశారు.

 

 

జగన్ సర్కారు కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులపై ఫిర్యాదులు ఇవ్వడం ద్వారా కేసీఆర్ కు జగన్ ఝలక్ ఇచ్చినట్టయింది. సాధారణంగా ఇద్దరు సీఎంలు మాట్లాడుకుంటే సెటిల్ అయ్యే వ్యవహారానికి బోర్డులు, కోర్టుల వరకూ ఎందుకన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఏపీ సర్కారు ఫిర్యాదులపై తెలంగాణ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: