తల్లిదండ్రులను దైవంగా భావించే రోజుల పోయి వారిని భారంగా భావించే రోజులు వచ్చేసాయి. జీవితకాలం ఎన్నో కష్టాలు పడి కన్నబిడ్డలను ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులు చివరికి వారి చేతే ఇంట్లోనుంచి గెంటివేయబడుతున్నారు. జీవిత చివరి మజిలిలో ఆ ముసలి వారికి తోడుగా ఉండాల్సిన కుటుంబ సభ్యులు తోడేళ్ళై వారికి వేధిస్తున్నారు. బయటకి చెప్పుకోలేక కొంత మంది ఇల్లు వదిలి వెళ్లిపోతుంటే, కొంతమంది బలవంతంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు.

 

 

తల్లిదండ్రులు భారంగా భావించే కొంతమంది వారిని దిక్కులేని వాళ్లుగా వృద్దాశ్రమాల్లో వదిలేసి చేతులు దులుపుకుంటున్నారు. అంత అన్యాయంగా తల్లిదండ్రులను వదిలేసి పోతున్నా తమ బిడ్డలు ఎప్పటికైనా తమ కోసం మళ్ళీ తిరిగి వస్తారని, తమని ఇంటికి తీసుకెళ్తారని వృద్దాశ్రమం గేటు తలుపులు దగ్గర కూర్చొని ఎదురుచూస్తూ అక్కడే ప్రాణాలు వదులుతున్నారు. అలాంటి ఓ తల్లి కథే  చిత్తూరు జిల్లాలో జరిగింది.

 


వివరాల్లోకి వెళ్తే.... చిత్తూరు జిల్లా గుడిపాలకు చెందిన పాపమ్మ (90)కు ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. పిల్లలందరినీ ఆమె ప్రయోజకులను చేసి పెళ్లిళ్లు చేసింది. వారిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు.అన్ని ఉన్నా కూడా తల్లికి వయసు పెరగడంతో భారంగా భావించారు. దగ్గరుండి మరీ చిత్తూరు నగరంలోని తపోవనం అనాథాశ్రమంలో చేర్పించారు. అప్పుడ ప్పుడూ కనీసం పలకరించకుండా మొహం చాటేశారు. తన బిడ్డలు కనీసం తన మొఖం చూడటానికి కూడా రాలేదని ఆమె తీవ్ర ఆవేదనకు గురైంది. గత కొన్ని రోజుల క్రితం అస్వస్థతకు లోనవ్వడంతో నిర్వాహకులు ఆమెకు ప్రధమ చికిత్స అందించారు. బాగా నీరసంగా ఉండటంతో  గ్లూకోజ్‌ ద్రావణం ఇచ్చారు. కన్నబిడ్డలకే భారంగా మారిన నా బతుకు ఎందుకు అనుకుందోఏమో  మరుగుదొడ్డిలో ఉన్న యాసిడ్‌ను గ్లూకోజ్‌లో కలుపుకుని తాగేసింది.

 

విషయాన్ని గమనించిన నిర్వాహకులు ఆమెను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కన్నబిడ్డల కోసం ఎదురు చూసి చూసి చివరికి  ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు వృద్ధురాలి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఏడుగురు సంతానం ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపానపోలేదని స్థానికులు వారిపై దుమ్మెత్తిపోశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: