దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. జూన్ 8వ తేదీ నుంచి అన్ లాక్ 1.0లో భాగంగా భారత్ లో భారీగా సడలింపులు ఇవ్వడంతో అంచనాలను మించి కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ వ్యాప్తి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. 
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెయ్యేసన్ మీడియాతో మాట్లాడుతూ కరోనా మహమ్మారి ఇంకా వేగంగా వ్యాప్తి చెందుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాలు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేసులు పెరుగుతున్నా సడలింపులు అమలు చేస్తూ ఉండటంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి చాప కింద నీరులా విజృంభిస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. 
 
అయినా ప్రపంచ దేశాలు వివిధ కారణాల వల్ల ఆంక్షలను దశల వారీగా ఎత్తివేస్తూ వస్తున్నాయి. ఫ్రాన్స్ లో ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు మ్యూజిక్ ఫెస్టివల్స్ ను నిర్వహిస్తున్నారు. లక్షల సంఖ్యలో పిల్లలు పాఠశాలలకు వెళుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదైన దేశాలలో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. 50,000కు అటూఇటుగా కేసులు నమోదవుతున్నా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో కరోనా వైరస్ ను చిన్న ఫ్లూతో పోల్చారు. 
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ కరోనా వైరస్ ఆర్థిక సంక్షోభం కంటే ప్రమాదకరమైనదని అన్నారు. కరోనాను ప్రపంచ దేశాలు ఐకమత్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు. దేశాలుగా విడిపోయి వైరస్ ను జయించడం సాధ్యం కాదని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో లాక్ డౌన్ సడలింపులు అమలవుతున్నాయి. దీంతో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: