
ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా టీకా కార్యక్రమంలో తొలి అంకం వేగంగా సాగుతోంది. దేశం నలుమూలలకూ టీకాల సరఫరా జోరందుకుంది. తొలిరోజు పెద్ద నగరాలకు టీకాలు తరలించగా.. రెండోరోజైన బుధవారం చిన్న నగరాలకు, పట్టణాలకు వ్యాక్సిన్లు చేరాయి. ఇప్పటిదాకా 56 లక్షల కొవిషీల్డ్ టీకాలు 13 నగరాలకు తరలగా.. కొవాగ్జిన్ టీకాలు 11 నగరాలకు చేరుకున్నాయి. ప్రభుత్వం నుంచి సీరం ఇన్‌స్టిట్యూట్ అందుకున్న 1.1 కోట్ల డోసుల ఆర్డర్‌లో 95 శాతం మేర సరఫరా అయినట్టు సమాచారం. మిగిలిన లక్ష డోసుల టీకాను త్వరలోనే పంపనున్నారు. ఇక.. ప్రభుత్వం నుంచి 55 లక్షల డోసులకు ఆర్డర్ అందుకున్నామని.. తొలి బ్యాచ్ టీకాలను సరఫరా చేశామని భారత్ బయోటెక్ సంస్థ బుధవారం ప్రకటించింది.
తమ వ్యాక్సిన్లను గన్నవరం, గువాహటి, పట్నా, ఢిల్లీ, కురుక్షేత్ర, బెంగళూరు, పుణె, భువనేశ్వర్, జైపూర్, చెన్నై, లఖ్‌నవు నగరాలకు పంపామని వెల్లడించింది. కేంద్రం నుంచి తొలి దశ టీకా కార్యక్రమానికి అవసరమైన వ్యాక్సిన్ డోసులు అందుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు శనివారం నుంచి టీకాలు ఇవ్వడానికి ఏర్పాట్లను ముమ్మరం చేశాయి.