న్యూఢిల్లీ: కేరళ అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరగబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగా కృషి చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి నేడు కాంగ్రెస్ పార్టీ కేరళకు చెందిన నేతలు నేడు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో వారంతా రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు. ఈ విషయంపై చర్చించడానికే రాష్ట్ర నేతలు రాహుల్ గాంధీతో భేటీ అయినట్టు తెలుస్తోంది.

ఇక ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని రాహుల్ గాంధీకి రాష్ట్ర నేతలు సూచించారు. దీనికా రాహుల్ గాంధీ కూడా ఓకే అన్నారని, ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండానే వెళ్లాలని చివరగా నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడమే మంచిదని, అభ్యర్థిని చూపించి ఎన్నికలకు వెళ్లడమనేది కష్టమైన పని అని రాష్ట్రంలోని కీలక నేతలు సందేహాలను వ్యక్తం చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీతో భేటీ అనంతరం కేరళ కాంగ్రెస్ పార్టీ అధినేత రామ చంద్రన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ సమావేశం గురించి స్పందిస్తూ.. కేరళలో మరో నాలుగు నెలల్లో జరగబోయే ఎన్నికల గురించి రాహుల్ గాంధీతో చర్చించామని అన్నారు.

ప్రశాంతమైన వాతావరణంలో తామందరం కలిసికట్టుగా అసెంబ్లీ ఎన్నికలకు పోవాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్టు పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రామచంద్రన్ జోస్యం చెప్పారు. కాగా.. కేరళలో ఒక సారి అధికారంలోకి వచ్చిన పార్టీ ఆ మరుసటి ఎన్నికల్లో అధికారంలోకి రాకపోవడం అనేది ఆనవాయితీగా వస్తోంది. 1957 నుంచి 2016 ఎన్నికల వరకు ఇదే జరుగుతూ వచ్చింది. 1977లో మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ రెండు సార్లు గెలిచి రికార్డు సాధించింది. ఈ సారి ప్రస్తుత సీఎం పినరయి విజయన్ మళ్లీ ఆ రికార్డు సాధించనున్నారని అనేక సర్వేలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: