ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ.. భవిష్యత్ అంతా ముందే చెప్పేస్తూ.. ఆంధ్రా ఆక్టోపస్ అనే పేరు తెచ్చుకున్నారు లగడపాటి రాజగోపాల్. రాష్ట్ర విభజన తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆమధ్య టీడీపీలో లేదా బీజేపీలో చేరతారని వార్తలొచ్చినా ఎక్కడా కుదురుకోలేదు. తనకు తానే ఒంటరిగా ఉంటూ వచ్చారు. అలాంటి రాజగోపాల్.. ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన సడన్ గా పవన్ కల్యాణ్ ని పొగడ్తల్లో ముంచెత్తారు. ఆయన రాజకీయం బాగుందని కితాబిచ్చారు.

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజకీయ శైలి బాగుందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అభినందించారు. విజయవాడ చుట్టుగుంటలోని శాతవాహన కళాశాలలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసి బయటకొచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. సమకాలీన రాజకీయాలపై స్పందించారు. సార్వత్రిక ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ ఓడిపోయినా.. ప్రజలను అంటిపెట్టుకొని ఉంటున్నారని, ఆయన రాజకీయం అభినందనీయమని చెప్పారు. ఓడిపోయినా కూడా పవన్ కల్యాణ్ ప్రజా పోరాటాలు చేస్తూనే ఉన్నారని, సీట్లు, ఓట్లు లెక్కలు వేసుకోకుండా ప్రజల్లోనే ఉంటున్నారని, ప్రజలతోనే ఉంటున్నారని అన్నారు లగడపాటి రాజగోపాల్.

వైసీపీ పాలనపై కూడా రాజగోపాల్ స్పందించారు. వైసీపీ పాలన ఎలా ఉందో మరో మూడేళ్ల తర్వాతే తెలుస్తుందని చెప్పారు. రాజకీయ పోటీ వల్లే సంక్షేమానికి పార్టీలు పెద్ద పీట వేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, సంక్షేమాన్ని బ్యాలెన్స్‌ చేయాలని సూచించారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోనని, సర్వేలకు దూరంగానే ఉంటానని స్పష్టం చేశారు. మొత్తమ్మీద పవన్ కల్యాణ్ ని మాత్రం ఆకాశానికెత్తేశారు రాజగోపాల్. అయితే ఆయన వ్యాఖ్యల వెనక అంతరార్థాలను వెదికే పనిలో ఉన్నారు విశ్లేషకులు. భవిష్యత్తులో రాజగోపాల్ పవన్ కల్యాణ్ తో కలసి పనిచేస్తారని, అందుకే ఆయనపై పాజిటివ్ గా మాట్లాడారని చెబుతున్నారు. ఎవరి ఊహలు ఎలా ఉన్నా.. లగడపాటి వ్యాఖ్యల వెనక మర్మం ఏంటో ఆయనకే తెలియాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: