ఏపీ ఉద్యోగులకు శుభవార్త.. ఇవాళ వారి ఖాతాల్లో జీతాలు జమ కాబోతున్నాయి. ఉద్యోగులు, పింఛనుదారుల మార్చి నెల వేతనాలు చెల్లించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. అదేంటి.. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖు కల్లా జీతాలు వచ్చేస్తాయి కదా అనుకుంటున్నారా.. కానీ.. ఈసారి మాత్రం ఏపీలో ఒకటో తారీఖు నాటికి జీతాలు రాలేదు. ఆర్థిక సంవత్సరాంతం కావడం, వరుస సెలవుల వల్ల జీతాల జమ ఆలస్యమైందంటున్నారు అధికారులు.

ఏదేమైనా.. ఏపీలో జీతాల కోసం ఉద్యోగులు, పెన్షనర్ల ఎదురుచూపులు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఎదురుచూపులు మాత్రం తప్పలేదు. మార్చి నెల జీతాలు, పింఛన్లు శనివారం వస్తాయేమోనని లక్షల మంది ఎదురుచూసినా రాలేదు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా శనివారం నాటికి రాలేదు. ఏపీలో 5 లక్షల మందికి పైగా ఉద్యోగులు, 3.60 లక్షల మంది ప్రభుత్వ పింఛనుదారులు ఉన్నారు.

అసలు జీతాల ఆలస్యం ఎందుకైందంటే.. ఏప్రిల్‌ ఒకటిన ఆర్థిక సంవత్సరం మొదటిరోజు కావడంతో బ్యాంకులకు సెలవు. ఏప్రిల్‌ 2న గుడ్‌ ఫ్రైడే కావడంతో బ్యాంకులు పనిచేయలేదు. శనివారమే చెల్లింపులు జరుగుతాయని వీరంతా ఎదురుచూశారు. అయితే  ఖజానాలో చాలినంత సొమ్ము అందుబాటులో లేకపోవడంతో శనివారం సాయంత్రం ఆర్థికశాఖ అధికారుల నుంచి సంబంధిత బిల్లులు రిజర్వ్‌ బ్యాంక్‌కు చేరలేదని అంటున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల బిల్లుల్ని ప్రతి నెలా 25వ తేదీకల్లా డ్రాయింగ్‌ డిస్‌బర్సుమెంట్‌ అధికారులు ఖజానా కార్యాలయాలకు పంపుతారు. వారు అక్కడ కింది నుంచి పైస్థాయి వరకు వాటిని పరిశీలించి సీఎఫ్‌ఎంఎస్‌కు పంపుతారు.

అక్కడ పరిశీలన తర్వాత ఆర్థికశాఖ అధికారులకు బిల్లులు చేరవేస్తారు. రాష్ట్రంలో నిధుల లభ్యతను బట్టి ఆర్థికశాఖ అధికారులు చెల్లింపుల ప్రక్రియ చేపడతారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో జీతాలు, ఇతరత్రా చెల్లింపులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉండేందుకు ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ రూపంలో ఆర్డినెన్సు జారీ చేశారు. అయితే ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఆమోదం పొందినా జీతాలు, పింఛన్లకు సంబంధించి ఆయా హెడ్‌లలో ఎంట్రీలు పూర్తి చేయకపోవడం వల్ల జీతాల చెల్లింపునకు ఇబ్బంది ఏర్పడినట్లు తెలుస్తోంది. వరుసగా సెలవులు రావడంతో ఆయా ఖాతాల్లో ఎంట్రీలు నమోదు కాలేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: