ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు కష్టకాలం రాబోతోందా.. ఓటుకు నోటు కేసులో ఆయన దోషిగా తేలే అవకాశం ఉందా.. ఆయనకు ముందు ముందు గడ్డ పరిస్థితులు ఎదురుకాబోతున్నాయా.. అంటే అవుననే అనిపిస్తోంది. ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసులో జరుగుతున్న విచారణ తీరు చూస్తే చంద్రబాబుకు షాక్ తప్పదేమో అనిపిస్తోంది. తాజాగా ఓటుకు నోటు కేసులో ఆయన వ్యతిరేకంగా సాక్ష్యం నమోదు అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే మన వాళ్లు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తానని చంద్రబాబు నాయుడు తనకు హామీ ఇచ్చారని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ఏసీబీ ప్రత్యేక కోర్టుకు నివేదించారు.
టీడీపీ క్రిస్టియన్ సెల్ నేత హ్యారీ సెబాస్టియన్ ఫోన్‌లో చంద్రబాబుతో మాట్లాడించారని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ స్పష్టం చేశారు. టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని.. మన వాళ్లు అంతా బ్రీఫ్ మీ..’వాళ్లు ఇచ్చిన హామీ నెరవేరుస్తా అంటూ.. చంద్రబాబు తనను ప్రలోభపెట్టారని అప్పటి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ వివరించారు. ఓటుకు కోట్లు కేసు విచారణలో భాగంగా స్టీఫెన్‌సన్ వాంగ్మూలాన్ని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు నమోదు చేశారు. చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడిన ఆడియోను కోర్టులో ప్లే చేయగా విని స్టీఫెన్‌సన్ ధ్రువీకరించారు.
అంతే కాదు.. రూ.50 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రికార్డు చేసిన వీడియో, ఆడియో దృశ్యాలను చూసి కూడా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ధ్రువీకరించారు. లంచం ఇచ్చేందుకు వచ్చిన సమయంలో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, రుద్ర ఉదయ సింహలు ఉన్నారంటూ వారిని కోర్టు హాల్లో ఐడెంటిఫికేషన్ సందర్భంగా గుర్తించారు. రేవంత్‌రెడ్డి సూచన మేరకు రూ.50 లక్షలు బ్యాగ్ నుంచి తీసి రుద్ర ఉదయ సింహ టేబుల్ మీద పెట్టారు. ఓటింగ్ తర్వాత రూ.4.5 కోట్లు ఇస్తామని చెప్పారు. ఈ ఘటన మొత్తం వీడియోలో రికార్డయింది.
డబ్బు ఇచ్చేందుకు వచ్చింది రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, రుద్ర ఉదయ సింహలే అని మరో ప్రత్యక్ష సాక్షి మార్కం టేలర్ వివరించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకూ ఎలాంటి మచ్చ లేదని చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఇది గట్టి ఝలక్ గానే భావించాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి