
కరోనా వైరస్ వలనే ప్రజలు అష్ట కష్టాలు పడుతుంటే మళ్ళీ కొత్తగా బ్లాక్ ఫంగస్ అనే కొత్త రకం వ్యాధి ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎప్పుడయితే కరోనా రెండో వేవ్ మొదలయిందో అప్పటి నుంచ బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతున్నాయి. కరోనా సోకిన వారు ఇష్టమొచ్చినట్టుగా స్టెరాయిడ్లు, యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తుండటంతో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువ అయిపోతున్నాయి. ఆ మందుల వలన కరోనా నియంత్రణలోకి వచ్చినాగాని బ్లాక్ ఫంగస్ మాత్రం వాళ్ళని వదలడం లేదు. కరోనా బారిన పడిన రోగుల్లో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా నమోదు అవ్వడం గమనార్హం అనే చెప్పాలి. కరోనా బాధితులు ఏదో పంటి సమస్య, లేదంటే పళ్ళు నొప్పిగా ఉన్నాయి అనుకుని డెంటిస్టుల దగ్గరికి వెళితే వాళ్లకు కళ్ళు బైర్లు కమ్మే నిజాలు తెలుస్తున్నాయి.వాళ్ళకి బ్లాక్ ఫంగస్ ఉన్నట్టు రిపోర్ట్స్ లో బయటపడుతోంది. అందుకనే కరోనా సోకి తగ్గినవారు దంతాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఇటువంటి కేసులకు సంబంధించిన లక్షణాలు, సమస్యలు, చికిత్స తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యనిపుణులు ప్రసాద్ మేక, ప్రత్యూష, సూర్యదేవర నిశాంత్ పలు సూచనలు చేశారు. మరి ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందామా.
ఈ బ్లాక్ ఫంగస్ అనేది ముందుగా ముక్కుకు నోటికి మధ్యలో అంటే అంగిటపై ఉన్న 'మాక్సిల్లా' ఎముకపై ముందుగా ప్రభావం చూపుతుంది. దీని వెనుకవైపు చెవి, ముక్కు,గొంతు భాగాలు వచ్చే వ్యవస్థలు ఉంటాయి. కిందివైపు దంత సంబంధిత వ్యవస్థలు ఉంటాయి. ఫంగస్ చాలా వరకు ముక్కు నుంచే ప్రవేశిస్తుంది. అలాగే కరోనా వైరస్ వలన ఇన్ఫెక్ట్ అయ్యే ప్రాంతం కూడా అక్కడే ఉండడంతో సమస్య తీవ్రత పెరుగుతుంది. సైనస్ సంబంధిత సమస్యలు, నొప్పి, నోటిలో దుర్వాసన, పళ్లు కదలడం, చిగుళ్ల వాపు, చీము రావడం వంటి సమస్యలు వస్తే వెంటనే డెంటిస్ట్‌లను సంప్రదించాలి.ఇలాంటి సమస్యలు లేదా లక్షణాలతో వచ్చిన పేషెంట్లను పరీక్షించినప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడుతున్నాయి.ఒకవేళ మాక్సిల్లా లేదా ప్యాలెట్‌లలో ఇన్పెక్షన్ పెరిగితే పన్ను లేదా పంటి చుట్టూ ఎముకను కట్ చేయాల్సి ఉంటుంది. ఈ చికిత్సను ఈఎన్‌టీ, డెంటల్ సర్జన్లు చేస్తారు.
అలాగే ఈ బ్లాక్ ఫంగస్ ముక్కులోంచి ప్రవేశించి పైదవడ, సైనస్, కళ్లు, మెదడుపై ప్రభావం చూపుతుంది. ఉన్నట్టుండి దంతాలు వదులుకావడం, అక్కడక్కడా తెల్లపొక్కులు ఏర్పడటం, చిగుళ్లకు రంధ్రాల మాదిరిగా ఏర్పడి చీము కారడం, అంగిటి నల్లబడటం, పన్ను తీసేసినప్పుడు గాయం ఆలస్యంగా మానడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలిసి టెస్టులు చేయించుకోవాలి. బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయటపడిన వెంటనే ట్రీట్‌మెంట్ అనేది తీసుకోవాలి. 3, 4 రోజుల్లోనే ఈ ఫంగస్ మెదడుకు చేరుకుని, ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది కావున ఆలస్యం తగదు. మరి ముఖ్యంగా కోవిడ్ వచ్చిన షుగర్ పేషెంట్లు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడినవారికి, కేన్సర్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్లకు బ్లాక్ ఫంగస్ ఎక్కువగా సోకుతుంది. కావున జాగ్రత్త అనేది చాలా ముఖ్యం. ఎటువంటి లక్షణాలు కనిపించినాగాని వెంటనే వైద్యులను సంప్రదించి సరైన జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సలహా.