ఒక‌ప్పుడు దేశంలో ప్ర‌కంప‌న‌లు రేపిన పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు కుంభ‌కోణానికి పాల్ప‌డ్డ మోహుల్ చోక్సీకి ఇప్పుడు పెద్ద షాక్ త‌గిలింది. ఆయ‌న‌కోసం ఇండియా ఎప్ప‌టినుంచో గాలిస్తోంది. ఆయ‌న్ను ఇండియాకు తీసుకొచ్చి శిక్షించాల‌నే డిమాండ్ కూడా ఎప్ప‌టి నుంచో ఉంది. పీఎన్‌బీ కుంభకోణం కేసులో డొమినికా పోలీసులు ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై ఆయ‌న త‌ర‌ఫున లాయ‌ర్లు కోర్టులో దాఖ‌లు చేసిన బెయిల్ బెయిల్‌ పిటిషన్‌ను మెజిస్ట్రేట్‌ కోర్టు తిరస్కరించింది. ఆంటిగ్వా నుంచి ఎందుకు పారిపోయి దొంగ‌త‌నంగా డొమినికాకు వ‌చ్చారో చెప్పాలంటూ కోర్టు ఆయ‌న్ను ప్ర‌శ్నించింది. ఆయ‌న చెబుతున్న వాద‌న‌ల‌పై త‌మ‌కు ఖ‌చ్చిత‌మైన న‌మ్మ‌కం లేద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది.

అయితే విచార‌ణ సంద‌ర్భంగా మెజిస్ట్రేట్‌ కోర్టుకు చోక్సీ చక్రాల కుర్చీపై హాజరయ్యారు. మే 23న ఆంటిగ్వాలో అదృశ్యమైన చోక్సీ.. కొద్దిరోజుల తర్వాత డొమినికాకు వెళ్లారు. దీనిపై కోర్టు ప్రశ్నించ‌గా.. చోక్సీని ఎవరో కిడ్నాప్ చేసి డొమినికాకు తీసుకొచ్చారని ఆయన తరఫు లాయ‌ర్ వివ‌రించారు. అయ‌తే అక్క‌డి పోలీసులు మాత్రం అక్రమంగానే ప్రవేశించారని చెబుతున్నారు.

భారత్‌లో 11 నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చోక్సీపై ఇప్ప‌టికే ఇంటర్‌పోల్‌ రెడ్‌ నోటీసు జారీ అయ్యిందని పోలీసులు కోర్టుకు వినిపించారు. ఇక బెయిల్ ర‌ద్దుపై పై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు చోక్సీ త‌ర‌ఫున లాయ‌ర్ వెల్ల‌డించారు. ఇక చోక్సీని ఎలాగైనా డొమినికా నుంచి ఇండియాకు రప్పించేందుకు సీబీఐ, ఈడీ ముమ్మ‌ర‌ ప్రయత్నాలు చేస్తున్నాయి.

అయితే ఈడీ, సీబీఐ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందకు అతని సోదరుడు చేతన్‌ చోక్సీ రంగంలోకి దిగి.. అక్కడి ప్రతిపక్ష నేతతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే దీనిపై కొంత డ‌బ్బు కూడా చెల్లించిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.  అయితే దీనిపై పూర్తిగా స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. ఇక మెహుల్ చోక్సీని భారత్‌కు పంపడానికి సంబంధించి కోర్టులో విచారణ జరగడానికి ముందే చేతన్ చోక్సీ హాంకాంగ్ నుంచి నేరుగా భారీ మొత్తంతో డొమినికాలో వాలిపోయాడని అక్క‌డి ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌తో వ‌రుస‌గా మంత‌నాలు జ‌రిపి, ఎలాగైనా మోహుల్ ను డొమినికాలో ఉంచే విధంగా బెయిల్ ఇప్పించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: